
ఏఈఈ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
♦ కోర్టుకెంత మంది వచ్చారో అన్ని పోస్టులు పక్కన పెట్టండి
♦ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది తీర్పునకు లోబడే...
♦ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (ఏఈఈ) పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే హైకోర్టును 22 మంది అభ్యర్థులు ఆశ్రయించిన నేపథ్యంలో అన్ని పోస్టులను భర్తీ చేయకుండా పక్కన పెట్టాలని అధికారులను ఆదేశించింది. అంతేకాక ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తం ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగాల భర్తీ నిబంధనలకు సవరణలు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులతో పాటు తదనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ చల్లా నర్సింహారెడ్డి, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది డాక్టర్ లక్ష్మీ నర్సింహ వాదనలు వినిపిస్తూ, ఉద్యోగ నిబంధనలకు సవరణలు చేసిన విద్యుత్ సంస్థలు తెలంగాణను ఉత్తర, దక్షిణ జోన్‌లుగా విభజించాయని.. ఈ రెండు జోన్‌లలో ఏదో ఒక జోన్‌లో జన్మించిన లేదా ఆరేళ్లకు మించి విద్యాభ్యాసం చేసిన వారిని మాత్రమే స్థానికులుగా పరిగణిస్తారని తెలిపారు. ఉద్యోగాల భర్తీలో 70శాతం స్థానికులకు, 30 శాతం స్థానికేతరులకు అవకాశం ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారని, లోతుగా విశ్లేషిస్తే ఆ 30 శాతం పోస్టులకు కూడా తెలంగాణ అభ్యర్థులే అర్హులవుతారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.
ఎలా చూసినా 100 శాతం పోస్టులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికే పరిమితం అవుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. గత విచారణ సమయంలో పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సడలిస్తూ, పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించుకోవచ్చునని స్పష్టంచేసింది. ఎంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారో అన్ని పోస్టులను భర్తీ చేయకుండా పక్కన పెట్టాలని ఆదేశించింది.