గ్రీన్‌సిగ్నల్
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్‌కు కేంద్రం ఆమోదం రూ.975కోట్లు ప్రాజెక్టు అంచనా వ్యయం
కరీంనగర్ రూరల్ : కరీంనగర్ ప్రజల రైలు కళ నెరవేరనుంది. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రైల్వేబోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అర్జున్‌పర్వేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రూ.975 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ రైల్వే లైన్ పనులను భూసేకరణ పూర్తయిన వెంటనే ప్రారంభించనున్నట్టు లేఖలో పేర్కొన్నారు. దశాబ్దాల కల నేరవేర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా పావులు కదుపుతున్నాయి.
షరతులు అంగీకరించాకే..
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం విషయంలో కేంద్రం ప్రభుత్వం పలు షరతులు పెట్టింది. భూసేకరణకు అయ్యే వ్యయంలో మూడోవంతును రాష్ట్రం ప్రభుత్వం భరించాలని, ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఐదేళ్లపాటు నిర్వహణ వ్యయాన్ని కూడా చెల్లించాలని పేర్కొంది. రాష్ట్ర సర్కారు ఈ షరతులకు అంగీకారం తెలపడంతో రైల్వే లైన్‌కు పచ్చజెండా ఊపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, 2004లో తొలిసారి కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన సమయంలో ప్రతిపాదించిన ఈ రైల్వేలైన్‌కు ప్రస్తుతం మోక్షం కలిగింది.
గతంలో 2006-07 రైల్వేబడ్జెట్‌లో రైల్వే లైన్ నిర్మాణానికి రూ.975 కోట్లు అవసరమవుతాయని, రాష్ట్ర ప్రభుత్వం 1/3 వాటాగా భరించాలని కేంద్రం సూచించగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముందుకురాలేదు. దీంతో ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి హుస్నాబాద్ మీదుగా సికింద్రాబాద్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రతిపాదించారు.
ఇటీవలి ఎన్నికల్లో పొన్నం స్థానంలో ఎంపీగా గెలిచిన వినోద్‌కుమార్ పాత ప్రతిపాదన వల్ల జిల్లాకు ప్రయోజనం లేదని పేర్కొంటూ కొత్తపల్లి-మనోహరాబాద్ లైన్ నిర్మాణ ప్రతిపాదనలను పంపారు. అందుకయ్యే భూసేకరణ ఖర్చులో మూడోవంతు, ఐదేళ్లపాటు నిర్వహణ వ్యయాన్ని భరించేందుకు రాష్ట్రం ముందుకు రావడంతో కేంద్రం ఆమోదం లభించింది.
కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు నియోజకవర్గాల మీదుగా...
ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్, నీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పరిధిలోకి వస్తాయి. ఈ రైలు మార్గం పూర్తై కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు 24 కిలోమీటర్ల దూరం తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్-ఢిల్లీ వెళ్లే రైళ్లు భువనగిరి, వరంగల్, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా నడస్తున్నాయి. కొత్త రైలు మార్గం వస్తే మనోహరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కొత్తపల్లి, పెద్దపల్లి మీదుగా రామగుండం ద్వారా ఢిల్లీకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణికులకు వ్యయప్రయాసాలు తగ్గి ఎంతోమేలు జరుగుతుంది.
రెట్టింపుకానున్నఅంచనా వ్యయం
2006-07 రైల్వే బడ్జెట్‌లో ఈ రైల్వేలైన్ నిర్మాణానికి రూ.975 కోట్ల ఖర్చవుతాయని అంచనా వేశారు. పదేళ్ల తరువాత ఆమోదం లభించడం, అందులోనూ రూట్‌మ్యాప్‌లో భారీ మార్పులు జరగడంతో వ్యయం రూ.1800 కోట్లకు చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూసేకరణ, పరిహారం చెల్లించడానికే ప్రాజెక్టు వ్యయంలో మూడోవంతు ఖర్చవుతుందని పేర్కొంటున్నారు.