పరిశ్రమలపై జీఎస్టీ ప్రభావమెంత ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పరిశ్రమలమీద వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రభావం ఎంతన్న అంశంపై దేశంలోని అత్యున్నత కన్సల్టెన్సీ కంపెనీతో అధ్యయనం జరిపించాలని భారీ పరిశ్రమలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకుంది. కన్సల్టెన్సీ నుంచి నివేదిక వచ్చాక పరిశ్రమలపై జీఎస్టీ ప్రభావం ఎంతన్నది తెలుస్తుందని ఉపసంఘం అభిప్రాయప డింది.
ఈటల రాజేందర్, కె.తారకరామా రావుతో ఏర్పాటైన ఈ మంత్రివర్గ ఉపసంఘం గురువారం ఎంసీహెచ్‌ఆర్డీలో సమావేశమై జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని పరిశ్రమలకు రాయి తీలు, వాటిమీద ప్రభావంపై చర్చించింది. రాష్ట్ర ఆర్థిక, పరిశ్రమలు, రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో పాల్గొన్న సీఐఐ ప్రతినిధుల బృందం, జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు చేపడుతున్న చర్యలతో పాటు పారిశ్రామికవేత్తల అభిప్రాయాలతో రెండు వారాల్లో ఓ నివేదిక అందిస్తామని మంత్రుల కు తెలిపింది. భారీ పరిశ్రమలకు రాయితీల కొనసాగింపుపై సైతం ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
మళ్లీ అగ్రస్థానం రావాలి..
సరళీకృత వ్యాపారం(ఈఓడీబీ) ర్యాంకిం గ్స్‌లో మళ్లీ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు మరింత చురుగ్గా పని చేయాలని కోరారు. సంస్కరణలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్ర స్థాయిలో అమలు చేయాలన్నారు. ఇంకా 108 సంస్కరణలను అమలు చేయాల్సి ఉందని అధికారులు మంత్రికి నివేదించారు. సత్వరంగా ఈ సంస్కరణలను అమల్లోకి తేవాలని మంత్రి ఆదేశించారు.
ఆ గనులు రద్దు చేయండి...
కార్యకలాపాలు ప్రారంభించని గనులకు నోటీసులిచ్చి లీజులు రద్దు చేసే కార్యక్రమాన్ని కొనసాగించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. గురువారం గనుల శాఖపై సమీక్ష సందర్భంగా నీర్ణీత గడువులోగా> లక్ష్యాలు చేరుకోని గనులకు సైతం జరిమానాలు విధించాలన్నారు. ఖనిజాల తవ్వకాలతో వచ్చే ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.