గుప్పుమంటున్న గుడుంబా.. | Gudumba Sellers Excise Department Warangal | Sakshi
Sakshi News home page

గుప్పుమంటున్న గుడుంబా..

Published Mon, Jan 21 2019 11:54 AM | Last Updated on Wed, Mar 6 2019 8:09 AM

Gudumba Sellers Excise Department Warangal - Sakshi

ఖానాపురం : జిల్లాలో గుడుంబా రక్కసి రెక్కలు చాస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గుడుంబాను తయారీ, విక్రయాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపే విధంగా ఉన్నతాధికారులకు సూచనలు సైతం చేసింది. ఆరంభ సమయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో గుడుంబా వ్యాపారులు జోరు సాగిస్తున్నారు. రాత్రి
సమయంలో కాకుండా ఉదయం సమయంలో యథేచ్ఛగా రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ప్రతీ తండాలో గుడుంబా తయారీ, విక్రయాలు మళ్లీ జోరందుకున్నాయి. అధికారుల అడపాదడపా తనిఖీలు చేసినా గుడుంబా తయారీదారులకు భయంలేకుండాపోతుంది. గుడుంబా నిర్మూలనలో భాగస్వాములు కావాల్సిన అధికారుల్లో కొంత మంది తయారీ, రవాణా, విక్రయదారులకు కొమ్ముకాస్తుండడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే భావన బలంగా వినిపిస్తోంది.

తనిఖీలకు ముందస్తు సమాచారం..
పోలీస్, ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలకు వెళ్తున్న సమయంలో ఆయా శాఖల్లోని కొంత మంది సిబ్బందికి ప్రతీ నెల వస్తున్న మామూళ్ల కారణంగా తనిఖీల సమయంలో ముందస్తు సమాచారాలు అందుతుండడంతో తండాల్లో గుడుంబా తయారీదారులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకావడంలేదు. అధికారులు తనిఖీలకు వెళ్లడానికంటే ముందే ఇళ్లలో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు.

పంట పొలాల వద్ద తయారీలు..
ప్రభుత్వం గుడుంబా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపడంతో వ్యాపారులు రూటుమార్చారు. చిలుకమ్మనగర్, నాజీతండా, బోటిమీదితండ, దబ్బీర్‌పేట వైపు నుంచి బెల్లం ఉదయం కార్లు, లారీ, టాటా ఏసీల్లో రవాణా అవుతుంది. నేరుగా పంట పొలాల వద్దకు తీసుకెళ్లి తయారీ చేసుకునే వారికి పంట పొలాల వద్దకు రవాణా చేస్తున్నారు. బెల్లం కొనుగోలు చేసిన వ్యాపారులు పంట పొలాల వద్దనే తయారీ చేసి విక్రయాలను మాత్రం తండాల్లో బాహాటంగానే నడిపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా విక్రయాలు చేసే వారు అధిక ధరలకు సైతం విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బెల్లం డంప్‌ అవుతున్న సమయాల్లో అధికారులకు సమాచారాలు అందినప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరిస్తుండడంతో అనుమానాలను తావిస్తోంది. 

జోరుగా బెల్లం రవాణా..
జిల్లాలో గుడుంబా తయారీ, విక్రయాలు, బెల్లం రవాణాకు తెరదించామనే భావనతో ఉన్న అధికారులకు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా రవాణా సాగిస్తున్నారు. ప్రధానంగా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలానికి చెందిన వ్యాపారులు, నెక్కొండ మండలానికి చెందిన కొంతమంది, నర్సంపేట పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు బెల్లం రవాణాకు పూనుకుంటున్నారని తెలిసింది. నెక్కొండ, నర్సంపేట, నల్లబెల్లికి చెందిన వ్యాపారులు రాత్రి సమయంలో ఖానాపురం మండలంలోని దబ్బీర్‌పేట మీదుగా కొత్తగూడకు, అశోక్‌నగర్, పాకాల మీదుగా, మంగళవారిపేట మీదుగా మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం వైపు బెల్లాన్ని తరలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఖానాపురం మండలంలోని దబ్బీర్‌పేటతో పాటు శివారు తండాలు, చిలుకమ్మనగర్, నాజీతండాతో పాటు తండాలన్నింటికీ బెల్లం ఉదయం సమయంలోనే విచ్చలవిడిగా రవాణా అవుతుండడంతో తయారీ సైతం విచ్చలవిడిగా సాగుతున్నట్లు తెలిసింది. జిల్లాలో రెండు రైల్వేస్టేషన్లు ఉండడంతో బెల్లం, గుడుంబా రవాణాకు తయారీదారులు, వ్యాపారులు అనువుగా మార్చుకున్నట్లు సమాచారం. నెక్కొండ, ఎల్గూర్‌ రంగంపేట రైల్వేస్టేషన్ల నుంచి యథేచ్ఛగా బెల్లం, గుడుంబా వ్యాపారం జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సమాచారం ఇవ్వాలి..
బెల్లం, గుడుంబా రవాణాపై నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాం.  గుడుంబా, బెల్లం లేకుండా రూపుమాపుతున్నాం. గ్రామాలు, తండాల్లోకి బెల్లం రవాణా అయితే సమాచారం అందించాలి. రవాణా, విక్రయాలు చేపట్టే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తాం. – శశికుమారి, ఎక్సైజ్‌ సీఐ, నర్సంపేట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement