ఇంటికి రాలేక... గల్ఫ్‌లో ఉండలేక | Gulf Agent fraud | Sakshi
Sakshi News home page

ఇంటికి రాలేక... గల్ఫ్‌లో ఉండలేక

Published Mon, Sep 18 2017 2:17 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

ఇంటికి రాలేక... గల్ఫ్‌లో ఉండలేక - Sakshi

ఇంటికి రాలేక... గల్ఫ్‌లో ఉండలేక

హైదరాబాద్‌లో మకాం...
► దొరికిన పనులు చేసుకుంటున్న వైనం
► విజిట్‌ వీసాలతో ఏజెంట్‌ మోసం
► పోలీసులకు బాధితుల ఫిర్యాదు


కోరుట్ల: ‘నాతోపాటు 40 మందిని ఏప్రిల్‌లో ఏజెంట్‌ దుబాయ్‌ పంపిండు.. అక్కడ నెల రోజులు ఉంచుకుని పనులు లేవని తిప్పి పంపిండ్రు.. ఇంటికి వెళ్లడానికి మొహం చెల్లక హైదరాబాద్‌లోనే ఉండి దొరికిన పనులు చేసుకుంటున్నం. ఏజెంట్‌ మమ్మల్ని నమ్మించి మోసం చేసిండు’ కోరుట్ల మండలం మోహన్‌రావుపేటకు చెందిన అందె సతీశ్‌(25) ఆవేదన ఇదీ. సతీశ్‌తోపాటు మరో ముగ్గురు యువకులు ఆదివారం గల్ఫ్‌ ఉద్యోగాల ఎరతో తాము మోసపోయిన వైనంపై కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గంభీర్‌పూర్‌ గ్రామానికి చెందిన గల్ఫ్‌ ఏజెంట్‌ కాల్వ శేఖర్‌ దుబాయ్‌లోని మైక్రో సీజన్స్‌ సప్లయ్స్‌ క్యాటరింగ్‌ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో జగిత్యాల జిల్లా కథలాపూర్, మేడిపల్లి, మల్యాల, మెట్‌పల్లి, గొల్లపల్లి, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్, కామారెడ్డి జిల్లా ఖమ్మం, విజయవాడ ప్రాంతాల నుంచి 40 మంది ఒక్కొక్కరు రూ.50 వేలు అతనికి చెల్లించారు. వారిని వారం రోజుల వ్యవధిలో ఏప్రిల్‌లో దుబాయ్‌ పంపాడు. తమను నెల రోజుల విజిట్‌ వీసాలతో అక్కడి పంపాడని బా«ధితులు సతీశ్, తిరుపతి, రమేశ్, ఏలేటి కుమార్‌ చెప్పారు.

దుబాయ్‌ తమకు రెండు రూంలు కేటాయించారని, ఒక్కో రూంలో 15–20 మంది వరకు సర్దుకుని నానా తిప్పలు పడ్డామన్నారు. అక్కడ కంపెనీలో సెక్యూరిటీ డిపాజిట్‌ కింద ఒక్కొక్కరి వద్ద 1,500 దర్హామ్‌లు(రూ.25 వేలు) తీసుకున్నారన్నారు. నెల గడువు ముగియడంతో తాము అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొందనీ, ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుని తిరిగి ఇండియాకు వచ్చామన్నారు. దుబాయ్‌ వెళ్లిన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన అక్రం, విజయవాడకు చెందిన రఫీ ఇంటికి తిరిగివెళ్లలేక హైదరాబాద్‌లోనే ఉండి పనిచేసుకుంటున్నట్లు తెలిసింది.

మరో ముగ్గురు యువకులు హైదరాబాద్‌లోనే పనులు చేసుకుంటున్నట్లు సమాచారం. తాము దుబాయ్‌ వెళ్లి మోసపోయామన్న విషయం తెలిస్తే.. ఇంటి వద్ద కుటుంబసభ్యులు ఆందోళన గురవుతారన్న ఆవేదనతో దొరికిన పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిసింది. ఉపాధి పేరిట తమను మోసగించిన ఏజెంట్‌పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బా«ధితులు సతీష్, రమేష్, తిరుపతి, కుమార్‌ కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజుతో ఆదివారం మొరపెట్టుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement