
గుమాస్తానగర్‌లో శివలింగం ప్రత్యక్షం!
రోడ్డు పనులను అడ్డుకోవడానికే: మున్సిపల్ కమిషనర్
తాండూరు: పట్టణంలోని గుమాస్తానగర్ (29వ వార్డు)లో రాత్రికి రాత్రే శివలింగం ప్రత్యక్షమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గుమాస్తానగర్‌లోని శివాలయానికి సుమారు పది అడుగుల దూరంలోని రోడ్డు వద్ద ఆకస్మాత్తుగా శివలింగం ప్రత్యక్షమైంది. సంఘటనా స్థలాన్ని అర్బన్ ఎస్‌ఐ నాగార్జున సందర్శించి వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా.. మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఈనెల 28వ తేదీన మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు చేపట్టామన్నారు.
ఈ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. అయితే రోడ్డు పనులను అడ్డుకోవడానికే గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు వద్ద శివలింగాన్ని ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు అర్బన్ సీఐ వెంకట్రామయ్యకు ఫిర్యాదు చేశామని, ఈ ఘటనపై విచారణ జరపాలని కోరినట్లు కమిషనర్ వివరించారు. అయితే శివాలయానికి చెందిన స్థలంలో మున్సిపల్ అధికారులు రోడ్డు పనులు చేపట్టడంపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.