మంత్రి పదవి రాగానే మాటెత్తని ‘ఉత్తమ్’
మేళ్లచెర్వు : మంత్రి పదవి రాగానే మూతికి గుడ్డ కట్టుకున్న మాజీమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కనీసం పులిచింతల పునరావాస పనులను కూడా పూర్తి చేయలేకపోయారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలో వివిధ పార్టీల నుండి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్‌లకు కొమ్ముకాస్తూ ప్రజల కోసం పనిచేయని కాంగ్రెస్ నాయకులు తమకు అనుభవం లేదనడం విడ్డూరమన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ఇతర పార్టీలు తెలంగాణద్రోహుల పార్టీల న్నారు.
తెంలంగాణ ప్రభుత్వం సాగర్‌లో డెడ్ స్టోరేజ్‌లో నీరున్నా ఎడమ కాలవకు నీటిని విడుదల చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సఖేందర్‌రెడ్డి తమకు అనుభవంలేదనడాన్ని ఆయన మరొకమారు తప్పుబట్టారు. తమ ప్రభుత్వం దళితులకు సేవలు చేసేందుకు దళితులకు మూడు ఎకరాల భూమి పంచుతుందన్నారు. ఇటీవల జరిగిన సాధారణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లెందుకు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే తెంలంగాణ అన్నిరంగాలలో అభివృద్ధి చెందనుందన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసి అన్ని గ్రామాల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు. అనంతరంఎంపీపీ భూక్యా ఝూమా చోక్లానాయక్, మాజీ ఎంపీపీ పాలేటి రామారావు, రామాపురం మాజీ సర్పంచ్ భసవయ్య, వేపలమాధవరం సర్పంచ్ శ్రీనివాస్, కోటయ్యల ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నాయకులు పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రవీణారెడ్డి, శంకరమ్మ, శివారెడ్డి తదితరలు పాల్గొన్నారు.