గురువారం క్యాంపు కార్యాలయంలో గురుద్వారా బోర్డు అధ్యక్షుడు సర్దార్ తారాసింగ్ బహూకరించిన తల్వార్‌తో సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్‌కు గురుద్వారా బోర్డు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: గురుగోవింద్ సింగ్ 350వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాగృతి యాత్ర ఈ నెల31న హైదరాబాద్‌కు చేరుకోనుంది. కులీకుతుబ్ షా మైదానంలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నాందేడ్ గురుద్వారా బోర్డు అధ్యక్షుడు, మహారాష్ట్ర ఎమ్మెల్యే సర్దార్ తారాసింగ్ ఆహ్వానించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. నాందేడ్ బోర్డులో రాష్ట్ర సభ్యుడు ఎస్.దల్జీత్‌సింగ్, గవర్నర్ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్‌సింగ్ ఆయన వెంట ఉన్నారు. వారి ఆహ్వానంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
యాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. గురుగోవింద్ జయంతి ఉత్సవాలు విజయవంతం కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తారాసింగ్ మాట్లాడుతూ తెలంగాణలో సర్వమత సమానత్వం, సౌభ్రాతృత్వం వర్ధిల్లుతోందన్నారు. రాష్ట్రంలోని మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. దేశంలో కేవలం రెండు నగరాల్లోనే సిక్కు మత వర్గానికి చెందిన మేయర్లున్నారని, అందులో తెలంగాణలో కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ ఒకరని గుర్తు చేశారు. అందుకు సిక్కులందరి తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.