గురుకుల నోటిఫికేషన్ రద్దు
హైదరాబాద్: అనుకున్నదే అయింది. గురుకుల నోటిఫికేషన్ రద్దయింది. త్వరలో కొత్త మార్గదర్శకాలతో మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. గురుకుల విద్యాలయాల్లో 7,306 బోధన, బోధనేతర పోస్టులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నోటిఫికేషన్‌లో గురుకుల పోస్టుల పరీక్ష రాసేందుకు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలని, బోధన అనుభవం ఉండాలని తదితర కొత్త నిబంధనలు పెట్టారు. దీంతో అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఫలితంగా గురుకుల పోస్టుల పరీక్ష రాసేందుకు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధనను, బోధన అనుభవం నిబంధనను తొలగించాలని.. ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు 50% మార్కులతోనే దరఖాస్తులను స్వీకరించాలని సీఎం కేసీఆర్ గురుకుల విద్యాలయాల సంస్థలను ఆదేశించారు. దీంతో సంక్షేమ శాఖలు, గురుకుల విద్యాలయాల సంస్థలు హుటాహుటిన సమావేశమై... జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి మార్గదర్శ కాల ప్రకారం కొత్త నిబంధనల రూప కల్పనపై కసరత్తు చేశాయి. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో అధికారులు చర్చించారు.
సీఎం ఆదేశాల ప్రకారం వాటిని సవరించి తిరిగి వారంలోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు దరఖాస్తుల స్వీకరణను ఆపేసింది. అయితే, ఆ సవరణలు ఇప్పట్లో కావని, కనీసం నెల రోజులు పడుతుందని కొందురు సీనియర్ అధికారులు చెప్పారు. అసలు నోటిఫికేషన్ రద్దయ్యి కొత్త నోటిఫికేషన్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా వార్తలు వినిపించాయి. సరిగ్గా ఆ ప్రకారమే కొత్త మార్గదర్శకాలతో త్వరలోనే నోటిఫికేషన్ వేస్తామంటూ ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్స్‌ను టీఎస్ పీఎస్సీ రద్దు చేసింది.