గురుకుల పోస్టులకు బ్రేక్
⇒ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటన
⇒ ఇంకా ఖరారుకాని కొత్త నిబంధనల రూపకల్పన
⇒ జాప్యం కారణంగా నోటిఫికేషన్ రద్దు
⇒ అర్హతలతో కూడిన మార్గదర్శకాలు వచ్చాకే నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలోని గురుకులాల్లో 7,306 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ గురువారం రద్దు చేసింది. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనపై తీవ్ర వ్యతిరేకత, కొత్త నిబంధనల రూపకల్పన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. నూతన నిబంధనలు వచ్చాక తిరిగి నోటిఫికేషన్ జారీ చేస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
ఇష్టారాజ్యంగా నిబంధనలు
గురుకులాల్లో తొమ్మిది కేటగిరీల్లోని 7,306 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. అయితే ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్న కొన్ని నిబంధనలపై తీవ్ర నిరసన వెల్లువెత్తింది. టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో కనీసం 60 శాతం, పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పీజీలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన పెట్టారు. మూడేళ్ల బోధన అనుభవం నిబంధన, టీజీటీ పోస్టుల్లో డిగ్రీ–డీఎడ్ కలిగిన వారికి అవకాశమివ్వకపోవడం, పీఈటీ పోస్టుల్లో బీపీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించకపోవడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా ఈ నిబంధనలు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండడం గమనార్హం.
జాప్యం జరగడంతో..
తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో నోటిఫికేషన్ నిబంధనలను సవరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. దాంతో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి చేపట్టాల్సిన దరఖాస్తుల స్వీకరణను టీఎస్‌పీఎస్సీ నిలిపివేసింది. గురుకుల సొసైటీలు, ప్రభుత్వం మార్పులతో కూడిన తాజా మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు ప్రారంభించాయి. కానీ దీనిపై జాప్యం జరుగుతోంది. కొత్త మార్గదర్శకాలు ఇంకా టీఎస్‌పీఎస్సీకి చేరకపోవడంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. కొత్త నిబంధనలు వచ్చాక, వాటి ప్రకారం మళ్లీ కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంలో నిరుద్యోగులు, ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళనలో మునిగిపోతున్నారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని త్వరగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.