'టీఆర్‌ఎస్, టీడీపీలు నైతిక విలువల్ని పక్కనపెట్టాయి'
నల్లగొండ: టీఆర్‌ఎస్, టీడీపీ పార్టీలు నైతిక విలువలు పక్కన పెట్టి దిగజారుడు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో కుటుంబ సభ్యులను విడదీసే సంస్కృతిని ప్రోత్సహించడం పట్ల ఎంపీ విచారం వ్యక్తం చేశారు. ఆదివారం నల్లగొండ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన సోదరుడు, మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంపై ఆయనపై విధంగా స్పందించారు.
సీఎం కేసీఆర్ కుటుంబంలో కూడా ఇలాంటి అంతర్గత కలహాలు చోటు చేసుకుని.. అన్నదమ్ములను విడదీయటం, తండ్రి-కొడుకు, అన్నా-చెల్లెలు, మామ-అల్లుళ్లను విడదీసే పరిస్థితులు వస్తే ఎలా ఉంటుందని గుత్తా ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని టీఆర్‌ఎస్ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.