సంతలో పశువులను కొన్నట్టు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రైతుల ఆత్మహత్యలను, రైతు సమన్వయ కమిటీలను ప్రధానంగా లేఖలో ప్రస్తావిస్తూ.. తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు. లేఖలో ముఖ్యమైన అంశాలు.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమితులు రైతు సమన్వయ సమితులు కావు, రాజకీయ సమన్వయ సమితులు అని ఆయన విమర్శించారు. ఇమేజ్ తగ్గుతుందని భావించినప్పుడు ఏదో ఒక అంశాన్ని తెచ్చి హంగామా చేయడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిందన్నారు. కరువు కాటకాలతో అల్లాడిన రైతులను ఏనాడూ పట్టించుకోకుండా, ఇవాళ రైతులకు ఏదో మేలు చేస్తున్నాట్టు నటిస్తున్నారని తెలిపారు.
సంతలో పశువులను కొన్నట్టు ఇతర పార్టీ నాయకులను కేసీఆర్ కొంటున్నారని ఆరోపించారు. రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చడానికే రైతు సమన్వయ కమిటీల పేరుతో ఓ దళారి సంస్థను నెలకొల్పారని మండిపడ్డారు. దానికి గుత్తా సుఖేందర్ అనే ఓ రాజకీయ దళారి(బేహారి)ని అధ్యక్షుడిగా నియమించారని విమర్శించారు. సమన్వయ సమితుల్లో కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుతూ టీఆర్ఎస్ కార్యకర్తలకే రైతు సమన్వయ సమితుల్లో అవకాశం కల్పిస్తామనడం రాజకీయ దివాళా కోరుతననాకి నిదర్శనమని అన్నారు.
కౌలు రైతును పట్టించుకోకుండా వారి ఉసురు పోసుకుంటున్నారని తెలిపారు. భూ సర్వేలో 1,61,000,00 లక్షల ఎకరాలు గుర్తించి కేవలం వారికి మాత్రమే పంట సాయం అందిస్తామంటే కౌలు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి చావులను అపహాస్యం చేశారని అన్నారు. రైతులను రౌడీ మూకలుగా మంత్రి తుమ్మల, భీమ డబ్బుల కోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని హోం మంత్రి నాయని అంటుంటే రైతుల పట్ల వారికున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతుందని పేర్కోన్నారు.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించే తీరిక లేని వ్యక్తి రైతుల బాధలు తీర్చడానికే సమన్వయ సమితులంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. రైతుల భూములు లాక్కుంటూ.. వారి శ్రేయస్సు కోసం పాటుపడుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కల్తీ విత్తనాలు, పురుగుల మందులు అరికట్టలేని అసమర్థులంటూ ఘటైన విమర్శలు చేశారు. ఇన్నాళ్లు ప్రధాని మోదీ అడుగులకు మడుగులోత్తుతూ.. ఇప్పుడు వాడు వీడు అనడంలో మతలబు ఏమిటంటూ నిలదీశారు.
ప్రధానితో చేసుకున్న లోపాయికారి ఒప్పందాలు చెడిపోయయా అని ప్రశ్నించారు. విభజన హామీ నెరవేర్చకున్న, బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపించిన కేంద్రాన్ని పల్లేత్తు మాట అనని ముఖ్యమంత్రి ఇప్పుడేందుకు ఒంటి కాలిపై లేస్తున్నారంటూ ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన వాటిని రీ-డిజైన్ పేరుతో కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలను ఎక్కువ సార్లు మోసం చేయలేరని, మోసపోతున్నాం అని ప్రజలు గ్రహించిన మరుక్షణం వారి ఆగ్రహ జ్వాలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ మాడిపోతుందని అన్నారు.