అక్రమార్కుల చెరలో హఫీజ్‌పేట్‌ కాయిదమ్మకుంట | Hafeezpet Lake Pond in Kabja And Funds Stops | Sakshi
Sakshi News home page

చెరువుల బాగేది?

Published Thu, Jan 9 2020 9:34 AM | Last Updated on Thu, Jan 9 2020 5:29 PM

Hafeezpet Lake Pond in Kabja And Funds Stops - Sakshi

కాయిదమ్మకుంట చెరువును నిర్మాణ వ్యర్థాలు, మట్టితో పూడుస్తున్న దశ్యం

సాక్షి, సిటీబ్యూరో/హఫీజ్‌పేట్‌: గ్రేటర్‌లో చెరువుల అభివృద్ధికి గ్రహణం పట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 185 చెరువులకు గానూ..19 చెరువులనుతొలివిడతగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఏడాది క్రితం నిర్ణయించింది. ఇందుకోసం రూ.280 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించింది. కానీ ఏడాదిగా ఇందులో కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులుఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పూర్తి చేసిన పనులకు గాను రూ.10 కోట్ల మేర పెండింగ్‌ బిల్లులు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. మరో వైపు డంపింగ్‌ యార్డులుగా మారిన ఆయా చెరువుల్లో తాము తొలగించిన ఘన వ్యర్ధాల పరిమాణం ఆధారంగా బిల్లులు చెల్లించడం లేదని పనులు చేపట్టిన ఏజెన్సీలు వాపోతున్నాయి. మరోవైపు పలు చెరువులు అక్రమార్కుల చెరలో చిక్కి డంపింగ్‌ యార్డులుగా మారుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా హఫీజ్‌పేట్‌లోని కాయిదమ్మకుంట నిలుస్తుంది. 

శాఖల మధ్య సమన్వయ లేమి..
తొలి విడతగా చేపట్టిన 19 చెరువుల అభివృద్ధి పనులను జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో..మిషన్‌ కాకతీయ పథకం కింద చేపట్టటంతో నీటిపారుదల శాఖ పర్యవేక్షణ సైతం ఈ పనులకు తప్పనిసరిగా మారింది. అయితే ఈ రెండు  శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బల్దియా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ చెరువుల విభాగాన్ని ఇరిగేషన్‌ శాఖకు బదిలీ చేస్తేనే పనులు ముందుకు సాగుతాయని నీటి పారుదల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై మున్సిపల్‌ పరిపాలన శాఖ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుతున్నారు.   

డంపింగ్‌ యార్డ్‌గాకాయిదమ్మ కుంట...
హఫీజ్‌పేట్‌లోని కాయిదమ్మకుంట జలాశయం బఫర్‌ జోన్‌లో అక్రమార్కులు ఇష్టానుసారంగా  చెలరేగిపొతున్నారు. ఓ వైపు ప్రైవేట్‌ వ్యక్తులు మట్టితో పూడ్చి చదును చేస్తుంటే, జీహెచ్‌ఎంసీ అధికారులు దీన్ని చెత్త డంపింగ్‌ స్థలంగా మార్చారు. మరో వైపు కుంట సమీపంలోని స్థలం ఉన్న వారు నిర్మాణ వ్యర్థాలతో డంపింగ్‌ చేస్తున్నారు. ఇదే తరహాలో మరికొద్ది రోజులు అక్రమాలు కొనసాగితే కాయిదమ్మ కుంట కానరాదేమోనని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాయిదమ్మ కుంట బఫర్‌ జోన్‌ ప్రైవేట్‌ వ్యక్తులకు ఫలహరంగా మారింది. కొద్ది సంవత్సరాలుగా బండరాళ్లు, మట్టితో యధేచ్ఛగా  పూడ్చుతూ చదును చేస్తున్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌ మార్చేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇంత జరిగినా ఇరిగేషన్, శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

బఫర్‌ జోన్‌లో అక్రమంగా చెత్తను ఆటోల ద్వారా డంపింగ్‌ చేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది
తాజాగా కొందరు వ్యక్తులు ట్రాక్టర్లతో నిర్మాణ వ్యర్థాలను చెరువు సమీపంలో ప్రైవేట్‌ స్థలంలో డంపింగ్‌ చేస్తున్నారు. దీంతో వరద రాకపోవడమే కాకుండా వర్షాకాలంలో వచ్చే వరదనీరు కలుషితమై చెరువులో కలిసే వీలుంది. బఫర్‌ జోనల్‌లో కొంత మంది అక్రమంగా సెల్‌టవర్‌ ఏర్పాటు చేశారు. విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ఏకంగా అధికారులను సంప్రదించకుండా దొడ్డి దారిన విద్యుత్‌ స్థంభాలను ఏర్పాటు చేసి కేబుల్‌ వైర్లను లాగి ఉంచారంటే టీఎస్‌సీపీడీసీఎల్‌ అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అపర్ణ కౌంటీ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రహరీ దగ్గరగా స్తంభాలు వేశారని, దీంతో సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు టీఎస్‌పీడీసీఎల్‌ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

కేసు నమోదు చేసి..మట్టి తొలగిస్తాం
కాయిదమ్మ కుంట బఫర్‌ జోన్‌లో చెరువు స్థలాన్ని మట్టితో పూడ్చివేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు.  బఫర్‌ జోనల్‌లో మట్టితో పూడ్చి చదును చేస్తే కేసులు నమోదు చేస్తాం. మట్టిని తొలగిస్తాం. విషయం తెలిసిన వెంటనే పూడ్చివేతను అడ్డుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం.– వంశీమోహన్, శేరిలింగంపల్లి తహసీల్దార్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement