సాక్షి, సిద్దిపేట : కలలో కూడా ఊహించని విధంగా కేసీఆర్ పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తున్నారని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూర్‌లో శుక్రవారం జరిగిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. హరీష్ మాట్లాడుతూ...‘ఐదేళ్ల కిందట ఇంటి స్థలాల ప్లాట్లు పంపిణీ చేశా. గతంలో ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ ఇచ్చే రూ.70 వేలు సరిపోయేవి కాదు. నేడు ప్రభుత్వ స్థలంలో రూ.5 లక్షలతో ఇళ్లు కట్టిస్తున్నాం. ఈరోజు ప్రతి అవ్వ ముఖంలో సంతోషం కన్పిస్తోంది. పేదల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పథకమే నిదర్శనం. అన్ని వసతులతో ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ప్రభుత్వం ఇచ్చిన ఆస్తిని కాపాడుకోవాలి. వీటిని అమ్మినా కొన్నా జైలుకు వెళ్తారు. వారం రోజుల్లో మిగిలిన16 మందికి ఇళ్లు మంజూరు చేస్తాం. త్వరలో ఇంటిస్థలం ఉన్నవారికి కూడా ఇళ్లు కట్టిస్తాం. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటి ఆదర్శ కాలనిగా మార్చాలి. పేదలకు ఇళ్లు ఇవ్వడం ద్వారా ఒక ప్రజా ప్రతినిధిగా నాకు చాలా సంతోషంగా ఉంది. మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాదు నేను. మిగిలిన పేదలకు కూడా ఇళ్లు కట్టిస్తాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment