సిద్దిపేట మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, సిద్దిపేట: పేద ముస్లిం మైనార్టీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని శుక్రవారం సిద్దిపేట మదీనా మసీద్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల్లో అన్ని మతాలు, కులాలు ఇమిడి ఉన్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరి అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు.
పేద ముస్లిం అమ్మాయిల పెళ్లికి పెద్దన్నగా షాదీ ముబారక్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందచేస్తున్న ముఖ్యమంత్రికి దేశవ్యాప్తంగా ప్రశంసలువచ్చాయని గుర్తు చేశారు. ముస్లింలకు హజ్‌యాత్ర ఎంతో ముఖ్యమైనదని, దీనిని గౌరవించిన ప్రభుత్వం ప్రతీ సంవత్సరం పలువురు ముస్లింలను హజ్ యాత్రకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే వారికోసం ప్రత్యేకమైన గురుకులాలు ఏర్పాటు చేశామని అన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. అందరి సహకారంతోనే మరోసారి ఎంపీగా ఎన్నికయ్యానని కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని మతాలు సుభిక్షంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జేసీ పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment