
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమి వెనుక అత్యంత దురదృష్టకరమైన సమీకరణలు చోటుచేసుకుంటున్నాయని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో కేవలం ఎన్నికలు మాత్రమే జరగడం లేదని అంతకుమించి కుట్రలు, కుతంత్రాలు నడుస్తున్నాయని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని ఎవరు పాలించాలనే అంశంపై ఎన్నికలు జరగాలికానీ.. తెలంగాణలో అలా జరగడంలేదన్నారు. స్వరాష్ట్రాం కోసం పోరాటం చేసిన వారు ఓవైపు, తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడ్డవారు, వ్యతిరేకంగా మాట్లాడినవారు మరోవైపు పోటీలో ఉన్నారన్నారు. ఎవరిచేతిలో రాష్ట్రం పదిలంగా ఉంటదో ప్రజలంతా ఆలోచన చేయాలని హరీష్ కోరారు.
తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండకపోతే మన మనుగడకే ముప్పువాటిల్లే అవకాశం ఉందని, అసలుకే మోసం వస్తుందని అనువానం వ్యక్తం చేశారు. మహాకూటమి ఏర్పాటు బయటకు కనిపించినట్లు కేవలం అధికారం హస్తగతం చేసుకోవడానికి కాదని, దాని లక్ష్యం వేరేలా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఉనికిని కబలించే కూటమని మండిపడ్డారు. తానే కేవలం రాజకీయాల కోసం మాట్లాడటంలేదని, గత అనుభవాలు, పక్కా ఆధారాలతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఎవరు పోటీచేయాలి? ఎవరి మధ్య పోటీ ఉండాలి? ఎవరు ప్రచారం చేయ్యాలి? అని ప్రశ్నించారు. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటో ప్రజలంతా గమనించాలని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇక్కడ పుట్టిన బిడ్డలే పోటీచేయాలని హరీష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment