
'అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు'
హైదరాబాద్: కాంగ్రెస్ వల్లే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టు తెలంగాణకు దక్కకుండా పోయాయని మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో అన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఏడు మండలాలను అనాధగా మార్చింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు.
తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. దిగువ సీలేరు ప్రాజెక్టులో వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని హరీశ్ రావు చెప్పారు. తెలంగాణకు కొత్త విద్యుత్ ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు. తమ పార్టీపై హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.