సాక్షి, సిద్దిపేట : తెలంగాణలో బీజేపీకి ఐదు సీట్లు కూడా రావని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు జోస్యం చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై రైతులు తిరగబడుతున్నారని.. ఈసారి వారికి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలోని హనుమాన్ నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రతిపక్షాల మాటలు విని మోసపోవద్దని, అభివృద్ధిలో ముందున్న సిద్దిపేట.. మెజార్టీలో కూడా ముందుండాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రజలతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని.. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డందుకు ఎన్ని మార్కులు వేస్తారో వేయమని ప్రజలను కోరారు.
ఆయన ఇంకేమన్నారంటే.. ‘కేసీఆర్ దీవెనలతో ఎక్కువ బాధత్యలను చేపట్టాను. సిద్దిపేటను అన్ని రకాలుగా అభివృద్ది చేశాను. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మహిళలకు డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. కాంగ్రెస్ వాళ్లు ఆడ బిడ్డ పెళ్లికి కనీసం ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. నర్సాపూర్ గ్రామంలో ఇండ్లు లేని ప్రతివారికి ఇళ్లు నిర్మిస్తాం. ఎస్సీలకు స్మశాన వాటికలను నిర్మిస్తాం. మూడువేలకోట్లతో సిద్దిపేటలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించుకుంటున్నాం. సోనియా గాంధీ తెలంగాణ వచ్చి పక్క రాష్ట్రానికి వరాలు ఇవ్వడం ఏంటీ? తెలంగాణ గురించి కనీసం ఒక్క మంచి మాట కూడా మాట్లాడలేదు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment