సాక్షి, సిద్దిపేట: గత ఐదుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దీవెన, మీ ఆశీస్సులతో గెలిపించారు.. మీ నమ్మకాన్ని పెంచే విధంగా నా బాధ్యత నెరవేరుస్తూ వచ్చాను. రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా అభివృద్ధికి అడ్రస్‌గా సిద్దిపేటను తీర్చిదిద్దాను.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి అని రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా హరీశ్‌రావు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. అంతకు ముందు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం, తర్వాత సిద్దిపేట వేంకటేశ్వర స్వామి దేవాలయం, పెద్ద మశీదు, చర్చిల్లో సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడి నుండి కార్యకర్తలతో కలిసి వెళ్లిన హరీశ్‌రావు చిన్నకోడూరు ఎంపీపీ కూర మాణిక్‌రెడ్డి, తుపాకుల బాలరంగంలు ప్రతిపాదించగా.. రెండు సెంట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డికి సమర్పించారు.
అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. స్వచ్ఛ భారత్‌కానీ, ఉపాధి హామీ పనుల్లో కానీ ఏ పథకంలో అయినా.. సిద్దిపేట జిల్లా పేరులేకుండా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు లేకపోవడం మీ అందరి సహకారమే కారణం అన్నారు. పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేసుకొని మహానగరాల సరసన సిద్దిపేటను చేర్చామని చెప్పారు. గతంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందిపడేవారని, ఇప్పుడు ఆ సమస్య లేదని అన్నారు.
ప్రజలకు ఏది అవసరమో దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ఆశీస్సులతో సాధించుకున్నామని అన్నారు. పండుగలు, పబ్బాలు, కష్టాలు, సుఖాల్లో మీలో ఒక్కరిగా కలగలిసి పోయానని, ఇది నా పూర్వ జన్మ సుకృతం అన్నారు. ఇంతటి అనుబంధంతో నన్ను మీరు ఆదరించారని, నాకు దేవుడు ఎంత శక్తిని ఇస్తే అంత ధారపోసి మీ సేవ చేస్తానని అన్నారు. సిద్దిపేట అంటే దేశంలోనే ఒక గుర్తింపు తెచ్చామని అన్నారు. మీరు సిద్దిపేటవాసులుగా గర్వంగా చెప్పుకునే విధంగా పని చేశానని అన్నారు. ఇక మిగిలింది సాగునీటి సౌకర్యం కల్పించుకోవడమే అన్నారు.
ఇందుకోసం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు తొంభై పైసల వంతు పనులు జరిగాయని, ఇక మిగిలింది పదిపైసల వంతే అన్నారు. ఈ కాస్తా పూర్తి చేసుకుంటే సాగునీటి కష్టాలు తీరుతాయని, ప్రతీ గ్రామానికి గోదావరి జలాల గలగలా పారే సవ్వడి వినిపిస్తుందని చెప్పారు. ఇలా ఇంటి ముందు కన్పించే అభివృద్ధిని చూడండి.. మీ కంటి ముందు కన్పించే టీఆర్‌ఎస్ అభ్యర్థినైన నన్ను చూసి ఓటు వేయాలని కోరారు.
ఇప్పటి వరకు సిద్దిపేట అంటే రాష్ట్రంలోనే మంచి పేరుందని, ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి రికార్డు సృష్టించాలని పిలుపు నిచ్చారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవరుగు రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్ రెడ్డి, గుంటి శ్రీనివాస్, గ్యాదరి బాలమల్లు, కూర మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్వమత ప్రార్థనలు
సిద్దిపేటజోన్: పట్టణంలోని దర్గా, మసీదు, చర్చిల్లో హరీశ్‌రావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని మసీదులో ప్రార్థనలు చేశారు అనంతరం సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఫాస్టర్ల ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుండి మోహినీపుర వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకుని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
సదా మీ సేవలో..
Published Thu, Nov 15 2018 10:37 AM | Last Updated on Thu, Nov 15 2018 10:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment