దశాబ్దం తర్వాత బుగ్గ కారు
- హరీష్‌రావుకు మంత్రి పదవి
- క్యాబినెట్‌లో సిద్దిపేటకు సముచిత స్థానం
- భారీ నీటిపారుదల శాఖ కేటాయింపు
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత సిద్దిపేట నియోజకవర్గానికి రాజయోగం పట్టింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం తొలివిడత ప్రమాణం చేసిన 11 మంది మంత్రుల్లో ఎమ్మెల్యే హరీష్‌రావుకు అవకాశం దక్కింది. భారీ నీటి పారుదల శాఖను హరీష్‌రావుకు కేటాయించించారు. సిద్దిపేట నియోజకవర్గానికి పది సంవత్సరాలుగా మంత్రి పదవి కరువైంది. ఈ క్రమంలో హరీష్‌రావుకు తొలివిడతలో మంత్రివర్గంలో బెర్తు ఖాయం కావడంతో నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి.
సిద్దిపేట శాసనసభకు 2004 ఉప ఎన్నిక ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన హరీష్‌రావు అప్పట్లోనే దివంగత నేత వైఎస్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. కూటమిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ పక్షాన హరీష్‌రావు ఎమ్మెల్యే కాకుండానే వైఎస్ కేబినెట్‌లో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేశారు. తొలిసారి మంత్రి హోదాలోనే అప్పట్లో నియోజకవర్గ అభివృద్ధికి పుష్కలంగా నిధులను విడుదల చేయించుకున్నారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుచిత వైఖరిని నిరసిస్తూ కొద్ది నెలల తర్వాతనే టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. దీంతో హరీష్‌రావు తన మంత్రి పదవిని వదులుకున్నారు. కాలక్రమేనా 2009 సార్వత్రిక ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచిన హరీష్‌రావు టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేతగా శాసనసభలో పార్టీ పక్షాన కీలక పాత్ర పోషించారు.
ఈ పదేళ్ల పాటు శాసన సభ్యుని హోదాలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడే తొలి మంత్రివర్గ కూర్పులో సిద్దిపేటకు సముచిత స్థానం దక్కింది. తెలంగాణ ప్రాంతంలో జలవనరుల అభివృద్ధిని మరింత పెంపొందించే దిశగా కేసీఆర్ తన మేనల్లుడు హరీష్‌రావుకు భారీ నీటి పారుదల శాఖతో పాటు అదనంగా మరో శాఖను కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.