సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో తలదాచుకుని బీహార్‌లోని బోధ్‌గయ పేలుళ్లకు కుట్ర పన్నిన జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) కీలక ఉగ్రవాది మహ్మద్ జహీదుల్ ఇస్లాం అలియాస్ కౌసర్ సామాన్యుడు కాదని నిఘా వర్గాలు చెప్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని గడగడలాడించేందుకు తక్కువ తీవ్రత గల 500 బాంబు పేలుళ్లకు ఒకేసారి పాల్పడ్డాడని, ఈ కేసులో అరెస్టు అయిన తర్వాత ఆరుగురు పోలీసుల్ని చంపి కస్టడీ నుంచి తప్పించుకున్నాడని పేర్కొంటున్నాయి. బోధ్‌గయ పేలుళ్లకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోమవారం పట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో కౌసర్‌సహా మరికొందరిపై సప్లమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం విదితమే. బంగ్లాదేశ్‌కు చెందిన కౌసర్ చిన్నతనంలోనే ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. 2000లోనే జేఎంబీలో చేరి కీలక వ్యక్తిగా మారాడు. పేలుడు పదార్థాల వినియోగంపై పట్టు ఉండటంతో జేఎంబీ ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యూల్ చీఫ్ సిద్ధిఖుర్ రెహ్మాన్ అలియాస్ బంగ్లా భాయ్‌కి కుడిభుజంగా మారాడు.
బంగ్లాదేశ్‌లో వరుస పేలుళ్లు...
కౌసర్ సూచనల మేరకు భారీ కుట్ర పన్ని 2005 ఆగస్టు 17న బంగ్లాదేశ్‌లో వరుస పేలుళ్లకు పాల్పడ్డాడు. బంగ్లాదేశ్‌లో ఉన్న 64 జిల్లాల్లోనూ జేఎంబీ క్యాడర్ ఏర్పాటు చేసుకుంది. వారి సాయంతో ఉదయం 11.30 నుంచి 12 గంటల మధ్య 63 జిల్లాల్లోని 300 ప్రాంతాల్లో 500 పేలుళ్లకు పాల్పడ్డారు. తక్కువ తీవ్రత కలిగిన ఈ బాంబుల్ని కేవలం తమ సందేశాలు ప్రజలకు చేర్చడానికే వినియోగించారు. ఈ నేపథ్యంలోనే ఇవి పేలినప్పుడు అందులో నుంచి కరపత్రాలు ఎగిరిపడ్డాయి. వీటిని బంగ్లా ప్రభుత్వం లెటర్ బాంబులుగా పేర్కొంది. ఎక్కడా ప్రాణనష్టం లేనప్పటికీ ఢాకాలో మాత్రం ఓ బాంబును గుర్తించిన ఇంటెలిజెన్స్ అధికారి దాన్ని తన చేతిలోకి తీసుకున్నారు. ఆ వెంటనే అది పేలిపోవడంతో ఆయన మరణించారు. ఈ కేసులో అరెస్టు అయిన కౌసర్ జైల్లో ఉండగా బంగ్లా పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రెహ్మాన్ మృతిచెందాడు. న్యాయస్థానం కౌసర్‌కు జీవితఖైదు విధించింది. జైల్లో ఉన్న ఇతడిని రక్షించడానికి జేఎంబీ క్యాడర్ 2009లో పట్టపగలు దాడి చేసింది.
ఆ సందర్భంలో ఆరుగురు పోలీసుల్ని చంపేసిన కౌసర్ తప్పించుకుని సరిహద్దులు దాటి భారత్‌లో తలదాచుకున్నాడు. తొలినాళ్లలో పశ్చిమ బెంగాల్‌లోని బురాధ్వన్‌లో షెల్టర్ తీసుకున్నాడు. కొందరు జేఎంబీ ఉగ్రవాదుల్ని అక్కడకు పిలిచి దేశీయంగా పేలుళ్లకు కుట్రపన్నాడు. అయితే, ఆ ఏడాది అక్టోబర్ 2న వీరి గదిలో తయారు చేస్తున్న బాంబు పేలి ఇద్దరు చనిపోగా కౌసర్ తప్పించుకుని పారిపోయాడు. ఆపై చెన్నైతోపాటు హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలోనూ కొన్నాళ్లు వ్యాపారిగా అవతారమెత్తి షెల్టర్ తీసుకున్నాడు. హైదరాబాద్‌లో ఉండగానే బిహార్‌లోని బోధ్‌గయను టార్గెట్‌గా ఎంచుకున్నాడు. మయన్మార్‌లో రోహింగ్యాలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రతీకారం తీర్చుకోవాలని జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) ఉగ్రవాద సంస్థ భావించింది. బౌద్ధ ప్రార్థన స్థలాలను టార్గెట్ చేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతోపాటు తమ ప్రతీకారం తీర్చుకోవాలని గత ఏడాది జనవరి 19న తమ పథకాన్ని అమలు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ అధికారులు గత ఏడాది ఆగస్టులో కౌసర్‌ను బెంగళూరులో పట్టుకున్నారు. దేశంలోని అనేక కేసులతోపాటు బంగ్లాదేశ్‌లోనూ ఇతడు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు. ఇక్కడి కేసుల విచారణ తర్వాత ఆ దేశానికి తీసుకువెళ్లనున్నారు.
వీడు సామాన్యుడు కాదు!
Published Wed, Jan 30 2019 3:23 AM | Last Updated on Wed, Apr 3 2019 3:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment