రైతుల శ్రమ తగ్గించాడు
పరిగి: చదువున్నా.. లేకున్నా అనుభవాలు పాఠాలు నేర్పుతాయనటానికి మెకానిక్ వెంకటేష్‌ను నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 7వ తరగతి వరకు మాత్రమే చదివిన ఆయన తన వృత్తిలో అనుభవాలను రంగరించి సొంత పరిజ్ఞానంతో రైతుల శ్రమను తగ్గించేందుకుఓ సరికొత్త పరికరాన్ని తయారు చేశాడు. దోమ మండలం కమ్మం నాచారం గ్రామానికి చెందిన వెంకటేష్ (27) పరిస్థితులు అనుకూలించక 7వ తరగతితోనే చదువు మానేశాడు. అనంతరం కూలిపనులు, చేను పనులు చేసేవాడు.
అనంతరం తెలిసిన వారి దగ్గర మోటార్ వైండింగ్ మెకానిక్ నేర్చుకున్నాడు. పరిగిలో ఓ దుకాణం ఏర్పాటు చేసుకుని తన వృత్తి కొనసాగిస్తున్నాడు. రైతుల బోరుబావుల్లోంచి పాడైన మోటార్లు తీయడటం, వాటిని బాగుచేసి మళ్లీ బోరుబావుల్లో దించటం చేస్తుంటాడు. ఈ సమయంలో 10 మంది అతికష్టమ్మీద బోరుబావుల్లోంచి పైపులు, మోటార్లను తీయాల్సివస్తోంది. మోటార్ తీయాల్సిన ప్రతిసారి రైతులు 10 మంది కూలీలను వెతుక్కోవాల్సి ఉంటుంది. కూలిడబ్బులు కూడా భారంగా మారుతు న్నాయి. రైతులకు ఎంతో ఇబ్బందిగా మారుతోంది. ఈ పనిని సులువుగా మార్చేందుకు వెంకటేష్‌కు ఓ ఆలోచనతట్టింది.
కొత్త పరికరం తయారీకి శ్రీకారం..
చేతిపంపు హ్యాండిల్ పైకి కిందకు కదపటం ద్వారా ఎంతో లోతులో ఉన్న నీరు పైకి ఉబికి వ చ్చే సూత్రాన్ని వినియోగించి అలాంటిదే ఓ కొత్త పరికరం తయారు చేశాడు. కొన్ని పైపులు ఒక దగ్గర చేర్చి వాటికి వెల్డింగ్ చేసి పరికరంగా మార్చాడు. తయారు చేసిన పరికరంతో ఒకరు మాత్రమే పట్టుకుని హ్యాండిల్‌ను పైకి కిందకు అంటుంటే పైపులు, మోటారుతో సహా పైకి వస్తాయి.
ఇవి పైకి వచ్చే క్రమంలో వాటిని టైట్ చేస్తూ పైకి లాగేందుకు మరొకరు అవసరం అవుతారు. ఇలా 10 మంది చేసే పనిని ఈ పరికరం వినియోగించి ఇద్దరు వ్యక్తులే సులువుగా చేయగలుగుతున్నారు. దీంతో రైతులకు మోటార్ పైకి లాగేటప్పుడు బాగు చేశాకా మళ్లీ దించే సమయంలో రూ. 2 వేల నుంచి 3 వేల వరకు ఖర్చు తగ్గుతుందని వెంకటేష్ పేర్కొంటున్నాడు. మోటార్‌ను వెలికితీసేందుకు పరికరం అవసరమైన రైతులు వెంకటేష్‌తోనే ఈ పనిని కానిస్తున్నారు. కూలిడబ్బులు, శ్రమను తగ్గించేలా పరికరాన్ని కనుగొన్న వెంకటేష్‌ను పలువురు రైతులు అభినందిస్తున్నారు.