కత్తిరిస్తే ఖతమే.. | Health Department Serious on Gender Tests | Sakshi

కత్తిరిస్తే ఖతమే..

Apr 11 2019 1:02 PM | Updated on Apr 11 2019 1:02 PM

Health Department Serious on Gender Tests - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌ :ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే తుంచేసే ఘటనలు కోకొల్లలు. ఇక నుంచి అబార్షన్‌ చేయించుకునే వారికి, చేసేవారికి ఇక చెక్‌ పడనుంది. ఆడపిల్లను రక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. స్కాన్‌ చేసి నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. అసలు కడుపులో పుట్టబోయే బిడ్డ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు డాక్టర్లు స్కానింగ్‌ చేస్తారు. దీనిని ఆసరా చేసుకుని కొందరు దంపతులు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ పిల్లా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికగుణంగానే స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు కొందరు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని లింగనిర్ధారణ చేస్తున్నారు. ఆడ పిల్ల అయితే శుక్రవారం అని, మగ అయితే సోమవారం అని కోడ్‌ భాషలతో దంపతులకు, తీసుకువచ్చిన ఆర్‌ఎంపీ డాక్టర్లకు చెబుతున్నారు.

ఆన్‌లైన్‌లో..
పుట్టబోయే పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి స్కానింగ్‌ చేసే కేంద్రాలు వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 46 ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కేంద్రాల్లో కేవలం సమాచారాన్ని సంబంధిత వైద్యులు ఇస్తున్నారు. ఇక నుంచి ఈ విధానంలో పూర్తి మార్పులు రానున్నాయి. లింగ నిర్ధారణ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. ప్రతీ కేంద్రంలో రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య వివరాలు జాతీయ, రాష్ట్ర కుటుంబ సంక్షేమం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు తెలుపాలి. ఆన్‌లైన్‌లో వివరాలు సంబంధిత నిర్థారణ కేంద్రాల వారు ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు వారికి తగిన శిక్షణ ఇచ్చారు. ఈ వివరాలు నమోదు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఆస్పత్రుల్లో ప్రసవించే వారి వివరాలతో పాటు వైద్య ఆరోగ్య శాఖకు పంపించాల్సి ఉంటుంది. ఈ వివరాల ద్వారా ఆడ, మగ జననాలు తెలుసుకుని ఏదైనా ఆస్పత్రుల్లో మగపిల్లల జననాలు ఎక్కువగా ఉంటే అక్కడ తనిఖీలు నిర్వహించి కారణాలు తెలుసుకుంటారు.

ఇప్పటికీ మొక్కుబడి చర్యలే..
లింగనిర్ధారణతో పాటు అబార్షన్‌ చేయించేందుకు జిల్లాలో కొంత మంది ఏజెంట్లు పని చేస్తున్నారు. జిల్లాలోని నెక్కొండలో ఓ ప్రైవేట్‌ క్లీనిక్‌లో అనుమతి లేకుండా లింగనిర్థారణ పరీక్షలు చేసి అబార్షన్‌ చేసినట్లు సమాచారం రావడంతో ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ తనిఖీ చేసే సమయానికి అన్ని సర్దుకుని పేషెంట్లు లేకుండా చేశారు. అలాగే క్లీనిక్‌లో ఎలాంటి ఆనావాళ్లు లేకుండా యజమాన్యం జాగ్రత్త పడింది. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఓ వైద్యుడు మొబైల్‌ స్కానింగ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఆ డాక్టర్‌ సూట్‌ కేసులో పెట్టుకుని వచ్చి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో స్కానింగ్‌ చేసి వెళుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద కుటుంబాల్లోని వారికి ఆడపిల్ల అని తెలిస్తే కొందరు దళారులు వారి వద్ద డబ్బులు తీసుకుని అబార్షన్లు చేస్తున్నారు. ఈ విషయాల్లో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.

చర్యలు ఇలా ..
లింగనిర్ధారణ ద్వారా కడుపులో పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిపిన వారిపై రూ10వేల జరిమానా, మొదటిసారి మూడు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది.
రెండోసారి అదే తప్పు చేసినట్లయితే రూ.50వేల జరిమానాతో పాటు ఐదు సంవత్సరాల జైలు శిక్ష , సంబంధిత కేంద్రాన్ని తొలగిస్తారు. వైద్యుడి గుర్తింపు పట్టా రద్దు చేస్తారు.
ఆడపిల్ల అని తెలిపి అబార్షన్‌ చేస్తే సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలతో పాటు మద్యవర్తులపై చట్టపరంగా చర్యలు, జైలు శిక్ష ఉంటుంది.

ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
స్కానింగ్‌ సెంటర్లపై ప్రత్యేక నిఘ పెట్టాం. స్కానింగ్‌కు వచ్చే వారి వివరాలు ప్రతి రోజు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేసినవి స్కానింగ్‌ చేసిన వాటిని మ్యానువల్‌గా చెక్‌ చేస్తాం. స్కానింగ్‌ సెంటర్లలో లింగనిర్థారణ పరీక్షలు చేయడం చట్ట రీత్యా నేరం. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.– డాక్టర్‌ మధుసూదన్,జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement