
సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రతకు ఓ రష్యన్ వ్యక్తి మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రష్యా దేశానికి చెందిన అలెగ్జాండర్ (38) టూరిస్ట్ వీసాపై మార్చి నెలలో హైదరాబాద్‌కు వచ్చాడు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ గేట్ నెంబర్–1 వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండటంతో పోలీసులు వెంటనే కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అలెగ్జాండర్ చికిత్సపొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మృతుడికి చెందిన కెమెరాలోని ఫొటోల ఆధారంగా ఈ నెల 4, 5వ తేదీల్లో సైరా సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా నటించినట్లు పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి సమీపంలోని ఓ హోటల్‌లో నివాసం ఉంటున్న అలెగ్జాండర్, ఈ నెల 10 హోటల్ నుంచి ఖాళీ చేశాడు. తర్వాత రోడ్లపైనే తిరుగుతూ కనిపించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వడదెబ్బ కారణంగానే అలెగ్జాండర్ మృతి చెందాడని, గోవాలో ఉండే అతని స్నేహితుడు బోరెజ్‌కు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. బోరెజ్ వచ్చిన తరువాతే పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment