మెదక్, న్యూస్‌లైన్: గుంట భూమి లేక గంజి నీళ్లు తాగుతున్న మాకు ప్రధాన మంత్రి భూములిస్తే మా బతుకులు మారుతాయనుకున్నాం. రెక్కలు ముక్కలు చేసుకుని రాళ్ల భూమిని రతనాలుగా మార్చినాం. తీరా పంటలు చేతికొచ్చాక నోటికాడి బువ్వను గద్ద తన్నుకు పోయినట్లు.. రజాకార్లోలె జంగ్లాతోళ్లు పొలాల మీద బడ్డరు. ఈ భూమి మాదంటూ కేసులు బెట్టిండ్రు.. గరీబులని సూడకుండా జరిమానాలేసిండ్రు. కనిపించిన నాయకుని కాళ్లు మొక్కినం.. ఆఫీసుల దగ్గర పడిగాపులు కాసినం. తొమ్మిదేళ్లవుతోంది. ఓట్లు వస్తున్నయ్,, పోతున్నయ్.. కాని మా పంచాయితీ తెగలేదు. మా పాణాలైన ఇస్తం కాని మా భూములు మాత్రం విడిచి పెట్టం’ అని అంటున్నారు గిరిజనులు.
వివరాల్లోకెళ్తే..
మెదక్ మండలం తొగిట పంచాయతీ పరిధిలోని సుల్తాన్‌పూర్ తండా అది. పేరులోనే సుల్తాన్ ఉన్నా.. వారంతా గుంట భూమి లేని గరీబు గిరిజనులే. కాయకష్టం చేసుకుని బతుకులీడ్చే 90 మంది గిరిజనులకు 372,367 సర్వే నంబరులో గల 180 ఎకరాల భూమిని 2005లో ప్రధానమంత్రి చేతుల మీదుగా పంచిపెట్టారు. ఈ మేరకు పట్టాదార్ పాసుబుక్కు లిచ్చారు. ఇందిర జలప్రభ, సీఎల్డీపీ పథకాల కింద బోర్లు వేసి భూ అభివృద్ధి చేశారు. బీడు భూమిని బంగారు భూమిగా మార్చారు.
కాని అందులోని 14 మంది గిరిజన కుటుంబాలను మాత్రం దురదృష్టం వెంటాడింది. శాంతి, సేవి, బుజ్జి, చందర్, విఠల్, రాంకీ, కమ్లీ తదితరుల పంటలు చేతికొచ్చే సమయానికి జంగ్లాతోళ్ళు ఊడిపడ్డారు. ‘ఈ భూమి జంగ్లాత్(ఫారెస్ట్)ది. మీరు మా భూమిని అక్రమంగా ఆక్రమించుకుని సాగు చేస్తున్నారు’ అంటు కేసులు పెట్టారు. ఆంతటితో ఆగక రూ 24 వేల నుంచి 30 వేల వరకు జరిమానాలు వేశారు. సాక్షాత్తూ ప్రధాని మంత్రి మన్మోహన్‌సింగ్ అందజేసిన పట్టాదార్ పాస్‌పుస్తకాలను చూపించినా వారు వెనక్కితగ్గలేదు.
దీంతో కళకళ లాడిన ఆ 28 ఎకరాల భూమి బీళ్లుగా మారింది. ఇక ఆ గిరిజనులు కనిపించిన అధికారులను, నాయకులను వేడుకున్నా వారి వేదన అరణ్య రోదనే అయ్యింది. తొమ్మిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ వారి సమస్యకు పరిష్కారం అభించలేదు. ‘మళ్ళీ ఎన్నికలు వచ్చినయ్. కొత్త ఎంపీలు..ఎమ్మెల్యేలు వస్తరేమో.. కనీసం ఇప్పటికైనా మా బతుకులు మరుతాయా’ అంటూ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. మా సమస్య తీర్చేవారికే ఓటేస్తం. లేకుంటే తండా పొలిమేరల్లోకి రానివ్వమంటూ తమ అక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.
కేసీఆర్ సభ కోసం భారీ ఏర్పాట్లు
Published Wed, Apr 23 2014 11:58 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM