వన దేవత.. జన జాతర | Heavy crowd to the medaram jathara | Sakshi
Sakshi News home page

వన దేవత.. జన జాతర

Published Sat, Feb 20 2016 2:39 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

వన దేవత.. జన జాతర - Sakshi

వన దేవత.. జన జాతర

మేడారానికి పోటెత్తిన భక్తజనం
♦ ఒక్కరోజే 40 లక్షల మంది రాక
♦ గత రెండు నెలలుగా కోటి మంది సందర్శన
♦ నేటితో ముగియనున్న మహా జాతర
 
 సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం జనసంద్రమైంది.. వన దేవతలకు మొక్కుల కోసం వచ్చిన భక్తులతో కిక్కిరిసింది. ‘సమ్మక్క కో.. సారక్క కో’ అంటూ భక్తుల జయజయధ్వానాలు.. శివసత్తుల పూనకాలతో దద్దరిల్లింది. చీరలు, రవిక ముక్కలు, ఎత్తు బంగారం(బెల్లం), ఎదురు కోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరి కాయలు.. ఇలా తీరొక్క రూపాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మ ప్రసాదం(బెల్లం) కోసం పోటీపడ్డారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయ శాఖ బంగారం ప్రసాదాన్ని భక్తులకు అందించలేదు. వన దేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువు దీరి ఉండడం.. పవిత్ర మాఘ శుద్ధ శుక్రవారం కావడంతో ఈ ఒక్కరోజే 40 లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. గత 2 నెలలుగా మేడారానికి ఇప్పటి వరకు కోటి మంది భక్తులు వచ్చినట్లు తెలిపారు.

 నేటితో జాతర ముగింపు
 ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు 1.10 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ గత జాతర కంటే ఈసారి భక్తుల సంఖ్య బాగా పెరిగింది. జాతరకు 2 నెలల ముందు నుంచే మొక్కులు చెల్లించుకున్నారు. జాతర మొదలైన 17 నుంచి భక్తుల రాక బాగా పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహా రాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి నుంచి భక్తులు తరలివచ్చారు. గిరిజను లు సంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరల నాదాలతో వన దేవతలకు మొక్కులు చెల్లించారు. నేటి(శనివారం) సాయంత్రం జాతర ముగియనుంది. చివరి రోజు కావడంతో భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది.

 వీఐపీల రాక.. భక్తులకు ఇబ్బందులు!
 వన దేవతలకు మొక్కులు సమర్పించేందుకు భక్తులు గురువారం అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో నిల్చున్నారు. శుక్రవారం ఉదయం వరకు భక్తులకు ఇబ్బందులు లేకుండానే దర్శనం జరిగింది. గరిష్టంగా గంట సమయంలో దర్శనం ముగించుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి వీఐపీల రాక ప్రారంభం కావడంతో భక్తులకు ఇబ్బందులు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ వస్తున్నారనే సమాచారంతో పలువురు మం త్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మేడారం చేరుకున్నారు. అయితే ఆయన పర్యటన రద్దయినట్లు సమాచారం తెలియగానే వీరంతా మేడారం గద్దెల వద్ద దర్శనానికి క్యూ కట్టారు.

పోలీసులు, అధికారులు వీరికే ప్రాధాన్యం ఇవ్వడంతో భక్తులు రెండు గంటలపాటు ఇబ్బందులు పడ్డారు. పలువురు ప్రజాప్రతినిధులు రెండుమూడు కార్లలో అనుచరులను వెంట బెట్టుకుని గద్దెల వద్దకు వెళ్లడంతో సాధారణ భక్తుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం కార్యాలయ స్టిక్కర్‌తో వచ్చిన కారు గద్దెల ముందే గంటలపాటు ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎ. చందూలాల్, పి.మహేందర్‌రెడ్డి, ఎంపీలు ఎ.సీతారాంనాయక్, పసునూరి దయాకర్, గరికపాటి మోహన్‌రావు, గుండు సుధారాణి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కల్వకుంట విద్యాసాగర్‌రావు, పుట్టా మధు, బి.శంకర్‌నాయక్, హన్మంత్ షిండే, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే బాబూమోహన్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ అనురాగ్‌శర్మ, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ తదితరులు శుక్రవారం మొక్కులు సమర్పిం చుకున్నారు.

 అమ్మల దీవెనతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తా: మేయర్ రామ్మోహన్
 మేడారం సమ్మక్క-సారలమ్మల దీవెనలతో హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తానని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం ఆయన మేడారంలోని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని నిలువెత్తు బంగారం(92కిలోలు) సమర్పించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా బిడ్డనైన తాను హైదరాబాద్ నగర మేయర్‌గా ఎంపిక కావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అశీర్వాదంతో పాటు మేడారం తల్లుల దీవెనలే కారణమన్నారు.
 
 సీఎం మేడారం పర్యటన రద్దు
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మేడారం పర్యటన రద్దయింది. శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక హెలి కాప్టర్‌లో మేడారం వెళ్లి సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవాల్సి ఉంది. సీఎం పర్యటనకు అధికార యం త్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. మేడారం పర్యటన తర్వాత వరంగల్‌లోని ఇంక్యుబేషన్ టవర్స్‌లో ఐటీ కాంప్లెక్స్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ జ్వరం కారణంగా సీఎం ఈ పర్యటనకు వెళ్లలేకపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
 
 తల్లుల నీడలో ప్రసవం
 మహాజాతరలో జన్మించిన మరో సమ్మక్క
 మేడారం బృందం: మేడారంలో సమ్మక్క-సారలమ్మ గద్దెలపై కొలువుదీరిన వేళ.. తల్లుల నీడలోనే ప్రసవించాలన్న ఓ మహిళ కల నెరవేరింది. ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన కందుకూరి జ్యోతి తొమ్మిది నెలల గర్భంతో మేడారం వచ్చింది. అక్కడే ప్రసవిస్తే బాగుండు అనుకుంది. ఆమెకు శుక్రవారం పురిటి నొప్పులు రాగా, కుటుంబ సభ్యులు సమీపంలోని మెగా వైద్యశిబిరానికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు దీప్తి, కీర్తి, సిబ్బంది సుందరి, మనోహరరాణి పర్యవేక్షణలో జ్యోతి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డీఎంహెచ్‌వో సాంబశివరావు, ఆర్డీ నాగేశ్వర్‌రావు తెలిపారు.  
 
 అమ్మల దర్శనం అదృష్టం
 తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలి: బాలకృష్ణ
 ములుగు: సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలసి ఆయన మేడారానికి వచ్చారు. దేవతలకు నిలువెత్తు బంగారం(బెల్లం)తో పాటు పసుపు-కుంకుమలు, కొబ్బరికాయ మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. కోటి మంది హాజరయ్యే జాతరలో తాను ఓ భక్తుడిని కావడం సంతోషకరమని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం కేసీఆర్ తరపున చందూలాల్ మొక్కులు
  అమ్మవారికి 56 కిలోల బంగారం సమర్పణ
 ములుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం పర్యటన రద్దవడంతో ఆయ న తరఫున గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ శుక్రవారం మొక్కు సమర్పించారు. 56 కిలోల బంగారం(బెల్లం) తులాభారం వేసి సమ్మక్క, సారలమ్మ తల్లులకు సమర్పించారు. అనంతరం అమ్మల గద్దెల నుంచి బంగారం తీసుకున్నారు. రెండు, మూడ్రోజుల్లో అమ్మవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందిస్తానని చందూలాల్ తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవతలను కోరుకున్నట్లు తెలిపారు.

 

(ఫొటోల కోసం క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement