భూకంపం వచ్చిందనుకుని ఆరుబయట కూర్చున్న చింతల్‌బోరి గ్రామస్తులు (ఫైల్)
భైంసా(ముథోల్): ‘ఎన్నో ఏళ్లుగా మాటేగాం నుంచి మా ఊరి మీదుగా చాత వరకు సరైన రోడ్డు లేదు. ఎట్టకేలకు రోడ్డు నిర్మించగా హైలోడ్‌తో వెళ్లే టిప్పర్లతో ఇది శిథిలమైంది. ఇందుకు కారణమైన చింతల్‌బోరి శివారులోని రెండు స్టోన్ క్రషర్‌లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపినా పట్టించుకుంటలేరు. ప్రజాప్రతినిధుల అండతోనే క్రషర్ యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, క్వారీలోని భారీ పేలుళ్లకు ఇళ్లు కంపించిపోతున్నాయి. మొన్న భారీ పేలుళ్లు సంభవించగా భూకంపం అనుకుని భయాందోళనకు గురయ్యాం’ అని నిర్మల్ జిల్లా భైంసా మండలం చింతల్‌బోరి గ్రామస్తులు వాపోయారు.
భూకంపం వచ్చినట్లుగా పేలుళ్లు..
స్టోన్ క్రషర్‌ల కోసం బండరాళ్లను తీసే క్వారీలో భారీ పేలుళ్లు భూకంపాన్ని తలపిస్తున్నాయి. ఈ నెల 21వ తేదీన క్వారీలో భారీ పేలుళ్లు సంభవించగా గ్రామస్తులు భూకంపం వచ్చిందునుకుని భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రెండు గంటల తర్వాత అవి క్వారీలో పేలుళ్లుగా నిర్ధారించుకుని ఇళ్లకు వెళ్లారు. ఇంత జరిగినా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. పేలుళ్లను ఆపే ప్రయత్నమూ చేయడంలేదు.
యథేచ్ఛగా క్రషర్ల నిర్వహణ..
భైంసా డివిజన్‌లో ఉదయం లేచింది మొదలు రాత్రయ్యే వరకూ జనానికి బ్లాస్టింగ్ భయం పట్టుకుంది. అడ్డగోలుగా క్రషర్‌లు వెలుస్తున్నా అధికారులు నిలువరించడంలేదు. జిల్లా వ్యాప్తంగా 22 క్వారీలను మైనింగ్ అధికారులు గుర్తించారు. కానీ.. క్రషర్ల సంఖ్య 50కి పైగానే ఉంది. రూ.కోట్ల నిధులు అభివృద్ధికి మంజూరు కావడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు క్రషర్‌లను సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు.
దీంతో ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా క్రషర్ల నిర్వహణ కొనసాగిస్తున్నారు. అక్రమంగా వెలుస్తున్న క్రషర్‌లపై సమీప గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ స్పందించడంలేదు. కొంతమంది ప్రజాప్రతినిధులు క్రషర్ నిర్వాహకులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలున్నాయి.
భారీ గుంతలు.. ప్రమాదాలకు నెలవులు..
భైంసా డివిజన్ వ్యాప్తంగా స్టోన్ క్రషర్‌ల యజమానులు బండరాళ్ల తరలింపుకోసం క్వారీల వద్ద భారీ గుంతలు తవ్వుతున్నారు. బండరాళ్లను తీసి గుంతలను అలాగే వదిలేస్తున్నారు. దీంతో వర్షాకాలంలో నీరు నిలిచి మనుషులకే కాకుండా పశువులు, అడవి జంతువులకు ప్రమాదం పొంచి ఉంది.
ఇష్టారీతిన వ్యవహరిస్తూ..
జిల్లావ్యాప్తంగా క్రషర్ నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. క్వారీలు ఉన్న ప్రాంతాల్లో నిబంధనల పేరిట లైసెన్సులు తీసుకుని అసైన్డ్ భూములు, వక్ఫ్‌భూములు, ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా క్వారీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో బండరాళ్లను వెలికి తీసి క్రషర్‌లకు తరలిస్తున్నారు. సమీప భూ యజమానులకు ఎంతోకొంత ముట్టజెప్పి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
జాప్రతినిధుల ముందు బాండ్ పేపర్లపై ఒప్పంద పత్రాలు రాయించుకుంటున్నారు. మైనింగ్ శాఖ అధికారులు క్రషర్‌లకు అనుమతులు ఇచ్చిన క్వారీలో బ్లాస్టింగ్ చేసేందుకు పోలీసు, రెవెన్యూశాఖ అనుమతులు తీసుకోవాలి. కానీ.. క్రషర్ యజమానులు తమ పలుకుబడితో క్రషర్‌ల నిర్వహణ చేపడుతూ జిల్లా ప్రజలకు ఇబ్బందులు కలిగేలా చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment