stone crusher blasting
-
ఢాం.. ఢాం..
ఆ పల్లె చుట్టూ ఎతైన గుట్టలు, పచ్చదనంతో ఉండే అడవి. ఓ పక్క నుంచి పొలాలకు సాగు నీటిని అందించేందుకు నిర్మించిన మహబూబ్ నహార్ కాల్వ. ఇవి కొల్చారం మండలం రాంనగర్ ప్రత్యేకతలు. ప్రశాంతంగా ఉన్న ఈ ఊరు శివారులోకి 2006లో ‘భూతంలా స్టోన్ క్రషర్ మిల్’ ప్రవేశించింది. సాయంత్రం అయిందంటే భారీ స్థాయిలో బండరాళ్లను పగలగొట్టేందుకు పెద్ద శబ్దాలతో బ్లాస్టింగులు చేస్తుండడం పరిపాటిగా మారింది. ఈ శబ్దాలకు చిన్నపిల్లలు, ముసలి వాళ్లు ఉలిక్కి పడుతున్నారు. అయినా పట్టించుకునే నాథుడు లేడు. వివరాలతో పరిశోధనాత్మక కథనం కొల్చారం(నర్సాపూర్) : గ్రామానికి అరకిలో మీటరు దూరంలో బోలుగు బండ(గుట్ట). ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 12 ఏళ్ల క్రితం రెండున్నర ఎకరాలకు స్టోన్‌క్రషర్ ఏర్పాటుకు లీజుకు తీసుకోని క్రషర్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి క్రషర్‌ను విస్తరించే దిశగా లీజుకు తీసుకున్న వ్యక్తులు నింబంధనలను తుంగలో తొక్కుతూ వ్యాపారాన్ని విస్తరిస్తూ వస్తున్నారు. మైనింగ్ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా పేలుడు పదార్థాలను ఇష్టారీతిగా వాడుతుండటంతో ఆ శబ్ధాలకు చుట్టు పక్కల ఉన్న పొల్లాలోని బోర్లు కూలుతుండటంతో పాటు పొలాలోకి వచ్చి పడుతున్న రాళ్లు, దుమ్ముతో ఇక్కడ వ్యవసాయం సాగక బీడుగా ఉంచవల్సిన దుస్థితి. అది కాక పక్కనే ఉన్న ఇందిరానగర్ కాలనీలోని ఇళ్ల గోడలు కూడా బీటలు పారుతున్నాయి. స్టోన్ క్రషర్ యజమానులకు నాయకులతో పాటు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్థానికులు చర్చిం చుకుంటున్నారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణానికి మైనింగ్ ద్వారా లీజుకు అనుమతి పొందిన సదరు యాజమానులు చుట్టు పక్కల ఉన్న రైతులను నయానో, భయానో బెదిరించి.., నాయకులను మచ్చిక చేసుకోని నాలుగు ఎకరాలకు విస్తరించారు. అధికారులకు లక్షల్లో సొమ్ము ముట్టజెప్పడంతో వీరి వ్యాపారానికి అడ్డు అదుపు లేకుం డా పోయిందని ఆరోపణలు వినిపిస్తున్నా యి. ప్రభుత్వ ఆదాయానికి గండి ఈ కంకర వ్యాపారం సాగిస్తున్న వ్యాపారులు మైనింగ్ నిబంధనలను ఏ మాత్రం పాటించడం లేదు. నిర్ధేశించిన లోతు కన్నా ఎక్కువ మేర తవ్వ కం చేపడుతున్నారు. కంకర రవాణలోనూ ఇదే పరిస్థితి. తెల్ల కాగితాలపై బిల్లులు ఇస్తూ ఇష్టారీతిగా రవాణా సాగిస్తున్నారు. వేబిల్ ఎక్కడా కానరాని దుస్థితి. బీడుగా ఉంచుతున్నాం.. రాత్రి పూట పెద్ద ఎత్తున బ్లాస్టింగులు చేస్తున్నారు. దీంతో నీళ్లు పోసే బోర్లు కూలి నీరు అందడం లేదు. అలాగే పొలంలో రాళ్లు పడటంతో వ్యవసాయం చేయలేక భుమిని బీడుగా ఉంచుతున్నాం. ఇదేమిటని ప్రశ్నిస్తే డబ్బులు తీసుకోమని బెదిరిస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. –రాము, రైతు రాంపూర్ చర్యలు తప్పవు.. నిబంధనలకు విరుద్ధంగా నడిచే స్టోన్ క్రషర్‌పై చర్యలు తీసుకుంటాం. వారికి ఇచ్చిన పరిధిలో, నిబంధనలను తప్పని సరి పాటించాలి. అతిక్రమిస్తే ఎవరిపైన అయినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. – జయరాజ్, జిల్లా మైనింగ్ ఏడీ -
ఇళ్లు కంపిస్తున్నయ్..
భైంసా(ముథోల్): ‘ఎన్నో ఏళ్లుగా మాటేగాం నుంచి మా ఊరి మీదుగా చాత వరకు సరైన రోడ్డు లేదు. ఎట్టకేలకు రోడ్డు నిర్మించగా హైలోడ్తో వెళ్లే టిప్పర్లతో ఇది శిథిలమైంది. ఇందుకు కారణమైన చింతల్బోరి శివారులోని రెండు స్టోన్ క్రషర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపినా పట్టించుకుంటలేరు. ప్రజాప్రతినిధుల అండతోనే క్రషర్ యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, క్వారీలోని భారీ పేలుళ్లకు ఇళ్లు కంపించిపోతున్నాయి. మొన్న భారీ పేలుళ్లు సంభవించగా భూకంపం అనుకుని భయాందోళనకు గురయ్యాం’ అని నిర్మల్ జిల్లా భైంసా మండలం చింతల్బోరి గ్రామస్తులు వాపోయారు. భూకంపం వచ్చినట్లుగా పేలుళ్లు.. స్టోన్ క్రషర్ల కోసం బండరాళ్లను తీసే క్వారీలో భారీ పేలుళ్లు భూకంపాన్ని తలపిస్తున్నాయి. ఈ నెల 21వ తేదీన క్వారీలో భారీ పేలుళ్లు సంభవించగా గ్రామస్తులు భూకంపం వచ్చిందునుకుని భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రెండు గంటల తర్వాత అవి క్వారీలో పేలుళ్లుగా నిర్ధారించుకుని ఇళ్లకు వెళ్లారు. ఇంత జరిగినా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. పేలుళ్లను ఆపే ప్రయత్నమూ చేయడంలేదు. యథేచ్ఛగా క్రషర్ల నిర్వహణ.. భైంసా డివిజన్లో ఉదయం లేచింది మొదలు రాత్రయ్యే వరకూ జనానికి బ్లాస్టింగ్ భయం పట్టుకుంది. అడ్డగోలుగా క్రషర్లు వెలుస్తున్నా అధికారులు నిలువరించడంలేదు. జిల్లా వ్యాప్తంగా 22 క్వారీలను మైనింగ్ అధికారులు గుర్తించారు. కానీ.. క్రషర్ల సంఖ్య 50కి పైగానే ఉంది. రూ.కోట్ల నిధులు అభివృద్ధికి మంజూరు కావడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు క్రషర్లను సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా క్రషర్ల నిర్వహణ కొనసాగిస్తున్నారు. అక్రమంగా వెలుస్తున్న క్రషర్లపై సమీప గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ స్పందించడంలేదు. కొంతమంది ప్రజాప్రతినిధులు క్రషర్ నిర్వాహకులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలున్నాయి. భారీ గుంతలు.. ప్రమాదాలకు నెలవులు.. భైంసా డివిజన్ వ్యాప్తంగా స్టోన్ క్రషర్ల యజమానులు బండరాళ్ల తరలింపుకోసం క్వారీల వద్ద భారీ గుంతలు తవ్వుతున్నారు. బండరాళ్లను తీసి గుంతలను అలాగే వదిలేస్తున్నారు. దీంతో వర్షాకాలంలో నీరు నిలిచి మనుషులకే కాకుండా పశువులు, అడవి జంతువులకు ప్రమాదం పొంచి ఉంది. ఇష్టారీతిన వ్యవహరిస్తూ.. జిల్లావ్యాప్తంగా క్రషర్ నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. క్వారీలు ఉన్న ప్రాంతాల్లో నిబంధనల పేరిట లైసెన్సులు తీసుకుని అసైన్డ్ భూములు, వక్ఫ్‌భూములు, ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా క్వారీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో బండరాళ్లను వెలికి తీసి క్రషర్లకు తరలిస్తున్నారు. సమీప భూ యజమానులకు ఎంతోకొంత ముట్టజెప్పి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. జాప్రతినిధుల ముందు బాండ్ పేపర్లపై ఒప్పంద పత్రాలు రాయించుకుంటున్నారు. మైనింగ్ శాఖ అధికారులు క్రషర్లకు అనుమతులు ఇచ్చిన క్వారీలో బ్లాస్టింగ్ చేసేందుకు పోలీసు, రెవెన్యూశాఖ అనుమతులు తీసుకోవాలి. కానీ.. క్రషర్ యజమానులు తమ పలుకుబడితో క్రషర్ల నిర్వహణ చేపడుతూ జిల్లా ప్రజలకు ఇబ్బందులు కలిగేలా చూస్తున్నారు. -
స్టోన్ క్రషర్స్‌లో బ్లాస్టింగ్.. కార్మికుడి మృతి
గరిడేపల్లి: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేటలో ఓ స్టోన్ క్రషర్స్‌లో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. వివరాలు.. వెంకటసాయి స్టోన్ క్రషర్స్‌లో రాళ్ల బ్లాస్టింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగి ఆర్.నాగేశ్వరరావు అనే కార్మికుడికి రాళ్లు తగిలాయి. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన వాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.