సాక్షి, హైదరాబాద్ : భాగ్య నగరం మరోసారి భారీ వర్షానికి చిగురుటాకులా వణికిపోయింది. సోమవారం సాయంత్రం భారీ వర్షం హైదరాబాద్‌ను ముంచెత్తింది. నగరంలోని డ్రైనేజీలు, నల్లాలు పొంగిపొర్లాయి. సాయంత్రం వేళ కావడంతో వాహనదారులు ఇంటికి చేరడానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు విస్తరించడంతో భారీ వాన కురుస్తోంది. ఉపరితల ఆవర్తనం కారణంగా మరో రెండురోజుల పాటు నగరంలో భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.
జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్ ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన కురుస్తోంది. ఖైరతాబాద్, కోఠి, నాంపల్లి దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, బేగంపేట్, సికింద్రాబాద్, ఉప్పల్, నాచారంలో భారీ వర్షం కురుస్తోంది. పాతబస్తీ లాల్ దర్వాజా, అలియాబాద్, చాంద్రాయణగుట్ట, శివాజీ నగర్, అరుంధతి కాలనీ, ఉప్పుగూడ, గౌలిపుర, మొఘల్‌పుర, షా అలీ బండ, ఛత్రినాక, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో జంట నగరాల్లోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బండ్లగూడ, పెద్ద అంబర్‌పేటలలోనూ పెద్ద ఎత్తున వర్షం పడుతోంది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, పటాన్‌చెరు, ఉప్పల్, సంతోష్‌నగర్, మెహిదీపట్నం, కార్వాన్, మలక్‌పేట, గోషామహల్ సర్కిళ్లలోనూ భారీ వాన కురుస్తోంది. అలాగే రంగారెడ్డి జిల్లా శంషాబాద్, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.
(అంబర్‌పేట్ వద్ద మూసీ నది వంతెనపై వరద నీటిలో చిక్కుకుపోయిన ఆటో.. తోసుకెళుతున్న ప్రయాణీకులు)
(దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే మార్గంలో అంబర్ పేట మూసీ బ్రిడ్జిపై నుంచి మూసీ నదిలోకి పొర్లుతున్న వరద నీరు)