నగరంలో గురువారం సాయంత్రం ట్రాఫిక్ ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలు దేరిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ఒక్క వానకే నగర రోడ్లు, ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తమయింది. దీంతో వర్షాకాలం ముగిసేవరకు ఇంకా ఎన్ని ఇక్కట్లు పడాల్సి వస్తుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం సాయంత్రం సరూర్‌నగర్‌లో 33.8, రాజేంద్రనగర్‌లో 28.8, నాంపల్లిలో 27.3, మలక్‌పేట్, ఫలక్‌నామాలో 25.0, చందానగర్‌లో 24.5, గోల్కొండలో 23.5, పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లో 21.0, హయత్‌నగర్‌లో 19.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఒక మోస్తరుపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment