ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా గజ్వేల్ పర్యటనకు ఆదివారం విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గజ్వేల్‌లో బహిరంగ సభకు దాదాపు 4 వేల మంది సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టింది. ప్రధాని పర్యటనను పర్యవేక్షించేందుకు ఒక అదనపు డీజీ ర్యాంకుగల అధికారితోపాటు ఇద్దరు ఐజీలు, ఒక డీఐజీ, నలుగురు ఎస్పీలకు బాధ్యతలు అప్పగించింది. ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బహిరంగ సభకు 1,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతను నగర కమిషనర్లకు అప్పగించింది. మరోవైపు ఢిల్లీ నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) సిబ్బంది రంగంలోకి దిగారు.
ప్రధాని కాన్వాయ్‌తోపాటు సభా ప్రాంగణాన్ని ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా గజ్వేల్ వెళ్లేందుకు నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లను ఎస్పీజీ సిద్ధం చేసింది. ఒక దానిలో ప్రధానితోపాటు సీఎం కేసీఆర్, ఇద్దరు ప్రత్యేక భద్రతా సిబ్బంది ప్రయాణించనున్నారు. మరో హెలికాప్టర్‌లో డీజీపీ, సీఎస్ తదితరులు వెళ్లనున్నారు.
మూడో హెలికాప్టర్‌లో ప్రధాని భద్రతా సిబ్బంది ప్రయాణించనుండగా మరో హెలికాప్టర్‌ను రిజర్వులో ఉంచనున్నారు. ప్రధాని కాన్వాయ్ కోసం ఢిల్లీ నుంచి రెండు ప్రత్యేక వాహనాలను తెప్పించారు. గజ్వేల్‌లో సభ కోసం 3 వేల ఆర్టీసీ బస్సులను హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల డిపోల నుంచి తరలిస్తున్నారు. మరో వెరుు్య ప్రైవేట్ బస్సులనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు.
ఏర్పాట్లపై మంత్రి హరీశ్ సమీక్ష
గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జేసీ వెంకట్రాంరెడ్డి, ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. సభావేదిక, ఆ తర్వాత హెడ్‌రెగ్యులేటర్ వద్ద పైలాన్ తుది దశ పనులను పరిశీలించారు.