పేదరికం నాగలి పట్టించింది!
ఇంటర్ చదివిన శైలజ.. ఎవరైనా సాయం చేస్తే చదువుకుంటానని వెల్లడి
అక్కన్నపేట (హుస్నాబాద్): పేదరికం ఆమెతో నాగలి పట్టించింది. తండ్రికి చేదోడుగా నిలవాలనే సంకల్పం ఆమె చేత వ్యవ‘సా యం’ చేయిస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లికి చెందిన గూల రవి, సారమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు. రవి తన రెండెకరాల భూమి సాగు చేసుకుంటూ, ఒంట్లో ఓపికున్నంత కాలం రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని అంతో ఇంతో చదివించగలిగాడు.
రబీ కలసి రాలేదు.. ఖరీఫ్‌లోనైనా కలసి రాకపోతుందా? అనే ఆశతో సాగు మొదలు పెట్టాడు. వ్యవసాయ ఖర్చుల కోసం, తమ ను చదివించేందుకు, కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి పడుతున్న ఇబ్బందుల్ని చూడలేక ఆయన పెద్ద కుమార్తె శైలజ.. సాగు పనుల్లోకి దిగింది. హుస్నాబాద్‌లో ఇంటర్మీడియ ట్ వరకు చదివిన ఆమె ప్రస్తుతం చదువు ఆపే సి, పూర్తిగా వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమైపోయింది. బుధవారం పత్తి విత్తేందుకు వీలు గా దుక్కిలో గొర్రు తోలింది.
చదువుకోవాలని ఉంది..
ఇంటర్ చదివాను. తండ్రి కష్టం చూడలేక వ్యవసాయంలోకి దిగా. స్నేహితురాళ్లు చదువుకోవడానికి పోతున్నారు. నాకూ చదువుకోవాలని ఉంది. కానీ, పూట గడిచే పరిస్థితి లేదు. అందుకే నాన్నకు కొడుకు లేని లోటు తీరుస్తూ సాయపడుతున్నాను. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే చదువుకుంటా.
– గూల శైలజ