
పల్లెల్లో సందడే సందడి.. సత్తుపల్లి: సరదాల సంక్రాంతి పండగ వచ్చేసింది... భోగి మంటలు.. పిండివంటలు.. గొబ్బెమ్మ లు.. రంగవల్లులతో పండగ వాతావరణం నెలకొంది. మరో వైపు సంస్కృతి పేరిట కోడిపందేలకు వెళ్లటం ఆనవాయితీగా వస్తోంది. సరిహద్దుల్లో సంక్రాంతి కోడిపుంజుల కొట్లాట కోసం పందెం రాయుళ్లు ఆంధ్రావైపు పరుగులు పెడుతున్నారు. పోలీసుల ఆంక్షలతో ఈసారి పందేలు జరుగుతాయో.. లేదోనంటూ పందెం రాయుళ్లు తెగ హైరానా పడ్డారు. సత్తుపల్లి నియోజకవర్గం తెలంగాణ–ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో కోడిపందేల సంస్కృతి బాగా ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లా శీతానగరం, ఐ.భీమవరం, పాలకొల్లు, వేల్పులచర్ల, కొప్పాక, దెందులూరు, కృష్ణాజిల్లా తిరువూరు, కాకర్ల ప్రాంతాలలో పందెం బిర్రులు ఏర్పాటు చేశారు.
ఉదయం నుంచే..
పందెం రాయుళ్లు ఉదయం నుంచే పందేలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయంటూ ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. సీతానగరం, తిరువూరు ప్రాం తాలలో కోడిపందేలు జరుగుతాయో, లేదో అనే ప్రచారం జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంట వర కు పందేలు జరగకపోవటంతో పందెం రాయుళ్లలో నిరాశ నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు అనుమతి వచ్చిందని సమాచారం అందటంతో సత్తుపల్లి చుట్టు పక్కల ప్రాంతా ల నుంచి తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. సంక్రాంతిపండగ మూడురోజులు పందేలు చూసేందుకు.. కాసేందుకు ఉత్సాహం చూపిస్తారు. సంకలో కోడిపుంజు ను పెట్టుకొని కారు, ద్విచక్రవాహనాలపై ఆంధ్రా వైపు పందెం రాయుళ్లు పరుగులు పెట్టడం పరిపాటిగా మారింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, స్నేహితులతో పందెం బిర్రుల వద్దకు వెళ్లి సరదా తీర్చుకుంటున్నారు.
తోటల్లో మద్యం.. ముక్క రెడీ..
కోడిపందేల కోసం మామిడితోటలు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. పలావ్ బిర్యాని, చికెన్ ఫ్రైతో మాంసం ప్రియులను ఆకట్టుకుంటున్నారు. మద్యం, మాసం ఒకే చోట దొరుకుతుండటంతో అక్కడక్కడ ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో జనరేటర్ సౌకర్యం కల్పించి మరీ పందేలు నిర్వహిస్తున్నారు.
కోడి పందేల మాటున జూదం..
కోడి పందేల మాటున రూ.లక్షల్లో పేకాట జూదం నడుస్తుంది. ఓ వైపు కోడి పందేలు జరుగుతుండగానే మరో వైపు కోసాట (లోనాబయట), గుండు పటాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. రూ.లక్షల్లో జూదం నడుస్తుండటంతో ఎంతో మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. కోడిపందేలు నియంత్రించేందుకు పోలీసులు నిఘా ముమ్మరం చేసి హె చ్చరికలు జారీ చేసినప్పటికీ పందెం రాయుళ్లు ఖా తరు చేయటం లేదు. పోలీసులు సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నా పందెంరాయుళ్లు కోడిపుంజులను వేరే దారిన పంపించి పందేల స్థావరాలకు చేరుకుంటున్నారు.
ఆంధ్రా బిర్రుల్లో ‘పేట’ పందెం కోళ్లు..
అశ్వారావుపేట: స్థానిక ఎన్నికలకోసం కాలు దువ్వుతున్న అభ్యర్థులు, వాళ్లను ఎన్నుకోవాల్సిన ఓటర్లు సోమవారం అశ్వారావుపేట సరిహద్దులో ఆంధ్రా కోడిపందేల బిర్రులకు చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడిగూడెం మండ లం శ్రీనివాసపురం, దేవులపల్లి, జీలుగుమిల్లి మండలంలోని పలు గ్రామాల్లో 90 శాతం వరకు అశ్వారావుపేట మండల వాసులే ఉన్నారు. తెలంగాణ జూదరుల కోసం ఆంధ్రా నిర్వాహకులు సదుపాయాలు, రక్షణ కల్పించేందుకు పోటీలు పడుతున్నారు. బిర్రుల వద్ద ఫెన్సింగ్, కుర్చీలు, బల్లలు, ఉచితంగా స్నాక్స్, బిర్యాని, మంచినీటి సౌకర్యం కల్పించారు. పేకాట, గుండు పట్టాలు, మూడు ముక్కలాట, పెద్ద మేడ, చిన్న మేడ జూద క్రీడల్లో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. గ్రామాల సమీపంలోనే ఉన్న పామాయిల్, మామిడి, కొబ్బరి తోటలే కోడి పందేలకు అడ్డాలయ్యాయి. తెలంగాణలో కోడిపందేలు, జూద క్రీడలకు అనుమతులు లేనందున ఆంధ్రా బిర్రులకు పోయి, పదిశాతం కేబుల్ (నిర్వహణ ఫీజు) చెల్లించి జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నా రు.
ఒక్కొక్క పందెం బిర్రులో ఇరువైపులా రూ. 50వేలు, గెలిచినవారికి రూ.90వేలు వస్తే వీటిలో పదిశాతం కేబుల్ ఫీజు చెల్లించాలి. బిర్రు లోపల ఒక్కొక్కొ పందెం రూ.లక్ష చేతులు మారితే బిర్రు బయట పై పందేల రూపంలో రూ.5 లక్షలకు పైగానే చేతులు మారుతున్నాయి. ఆరుగాలం శ్రమించి కూడబెట్టుకున్నదంతా ఆంధ్రా బిర్రుల్లో డబ్బును ధారబోస్తున్నారు. జూదరులు సరిహద్దు లు దాటకుండా నిలుపుదల చేయడంలో పోలీసు ల పాత్ర నామమాత్రంగా ఉండటంతో ఆంధ్రా బిర్రుల్లో ‘పేట’ పందేలు జోరందుకున్నాయి. విద్యుత్ దీపాల వెలుగులో పందేలు కొనసాగిస్తున్నారు. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పండగ శుభాకాంక్షలు చెప్పేందుకు ఫోన్ చేస్తే కొందరి ఫోన్‌లు స్వీచ్‌ఆఫ్, అంతా ఏకాగ్రత తో పందేల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment