
అశ్వాపురం(ఖమ్మంజిల్లా): పొట్ట కూటి కోసం జిల్లాలు, రాష్ట్రం దాటి వెళ్లిన గొర్రెల కాపరులైన ముగ్గురు యువకులను రోడ్డు ప్రమాదం బలిగొంది. అశ్వాపురం మండలం మొండికుంట గ్రామశివారు పాలవాగు సమీపంలో గురువారం రాత్రి ఇది జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం పైడిరెడ్డిగూడెం గ్రామస్తులు మేకల వెంకట్రావు (34), కత్తిగూడెంగ్రామస్తుడు పులిచెర్ల సత్తిపండు(27), చింతాయిగూడెం గ్రామస్తుడు లావు పోశయ్య (22) గొర్రెల కాపరులు. నెల కిందట బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఉంటూ గొర్రెలు మేపుతున్నారు. ఈ ముగ్గురూ కలిసి కృష్ణసాగర్‌లో ఓ స్థానికుడి బైక్ తీసుకుని అశ్వాపురం మండలం మొండికుంటకు కూరగాయల కోసం వచ్చారు.
కూరగాయలు, సరుకులు తీసుకుని బైక్‌పై కృష్ణసాగర్ వెళుతున్నారు. మరో ఐదు నిమిషాల్లో గమ్యానికి చేరుకునేవారే. ఇంతలోనే మొండికుంట గ్రామ శివారు పాలవాగు సమీపంలో మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై కొత్తగూడెం నుంచి మణుగూరు వైపు వేగంగా వెళుతున్న లారీ ఆ బైక్‌ను ఢీకొంది. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంకట్రావు, సత్తిపండుకు భార్య, పాప ఉన్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని సమాచారం. ప్రమాద స్థలాన్ని అశ్వాపురం సీఐ బొల్లం రమేష్ పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment