
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా స్థిరమైన ఆదాయం లభిస్తోంది. తొలి నాళ్లలో కొంత ఒడిదొడుకులకు లోనైనా గత మూడేళ్లుగా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానా కు కాసుల పంట పండుతోంది. రాష్ట్రంలో స్థిరమైన అభివృద్ధి కొనసాగుతుండటం.. రియల్ రంగం కూడా ఊపందుకోవడంతో రిజిస్ట్రేషన్ల పంట పండుతోందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆర్థిక మాంద్యం ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్ అంచనాల ప్రకారం 2020 మార్చి చివరి నాటికి రూ.6,146 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, మరో 2 నెలలు మిగిలి ఉండగానే 2020 జనవరి నాటికే రూ.5,261 కోట్లు (85 శాతం) ఆదాయం లభించింది. మాంద్యం ప్రభావం రియల్ రంగంపై పడుతుందనే అపోహలను పటాపంచలు చేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ భారీ ఆదాయాన్ని ఆర్జిస్తుండటం విశేషం.
తొలి మూడేళ్లు.. ఆ తర్వాతి మూడేళ్లు
రిజిస్ట్రేషన్ల ఆదాయంలో గత మూడేళ్లలో గణనీయ అభివృద్ధి కన్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ఇచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాదిలో బడ్జెట్ అంచనాల్లో 84 శాతమే రిజిస్ట్రేషన్ల రాబడి వచ్చింది. మొత్తం ఆ ఏడాది రూ.2,583 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేయగా, రూ.2,175 కోట్ల వద్ద ఆగిపోయింది. ఆ తర్వాతి ఏడాది కూడా అదే స్థాయిలో 83.92 శాతం ఆదాయం రాగా, మరుసటి ఏడాది (2016–17)లో 89 శాతానికి పెరిగింది. ఇక 2017–18 సంవత్సరానికి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ల ఆదాయంలో భారీ పెరుగుదల నమోదైంది. ఆ ఏడాది మొత్తం రూ.3 వేల కోట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సమకూరుతాయని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో పేర్కొనగా, ఏకంగా రూ.4,200 కోట్లకు పైగా రాబడి వచ్చింది. అంటే బడ్జెట్ అంచనాల్లో దాదాపు 140 శాతం ఆదాయం రావడం గమనార్హం. ఆ తర్వాతి ఏడాది కూడా రిజిస్ట్రేషన్ రాబడుల్లో పెరుగుదలే కన్పించింది. మొత్తం అంచనాలకు మించి 113 శాతం ఆదాయం లభించింది.
రిజిస్ట్రేషన్ల ఆదాయంపై బడ్జెట్ అంచనాలు, రాబడుల వివరాలు (రూ. కోట్లలో)
ఈ ఏడాది ఇప్పటివరకు బడ్జెట్ అంచనాల్లో 85 శాతం మరో 2 నెలల మిగిలి ఉండగానే వచ్చేసింది. మొత్తం రూ.6,146 కోట్లు ఈ ఏడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, 2020 జనవరి నాటికే రూ.5,261.85 కోట్లు వచ్చింది. మరో 2 నెలల్లో ఈ ఏడాది కూడా అంచనాలను మించుతుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఆరేళ్ల రాబడులను పరిశీలిస్తే ఏటేటా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గుదల ఒక్క ఏడాది కూడా నమోదు కాలేదు. గతేడాది జనవరి వరకు రూ.4,574 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది జనవరి వరకు ఏకంగా దాదాపు రూ.700 కోట్లు అధికంగా రూ.5,261 కోట్లు ఆదాయం లభించింది. తొలి ఏడాది రూ.2,175 కోట్లున్న రిజిస్ట్రేషన్ల ఆదాయం ఈ ఏడాది రూ.6 వేల కోట్లు దాటి పోయే పరిస్థితి వచ్చింది. ఏటేటా పెరుగుదల నమోదు చేసుకుంటున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు రూ.23,910 కోట్లు ఆర్జించడం గమనార్హం.
ఆ రెండు ఒక లెక్క
రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ రాబడులను పరిశీలిస్తే.. మొత్తం 12 రిజిస్ట్రేషన్ జిల్లాలకు గాను రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. ఈ 2 జిల్లాల్లోనే మొత్తం ఆదాయంలో 50 శాతానికి పైగా ఆదాయం వస్తోంది. ఈ ఏడాది లెక్కలను పరిశీలిస్తే ఇప్పటివరకు మొత్తం రూ.5,261.85 కోట్ల ఆదాయం రాగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి రూ.3 వేల కోట్లకు పైగా వచ్చింది. అంటే వచ్చిన మొత్తం ఆదాయంలో ఈ రెండు జిల్లాల నుంచే 57 శాతం వరకు వచ్చిందన్న మాట. మిగిలిన జిల్లాల విషయానికి వస్తే మెదక్, హైదరాబాద్ (సౌత్), వరంగల్, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలు స్థిరమైన ఆదాయాన్ని సాధించి పెడుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి.
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆదాయం లభించేందుకు రియల్ జోరే కారణమని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో ఏటా లావాదేవీలు పెరిగిపోతున్నాయని వారంటున్నారు. భూముల క్రయవిక్రయాలకు తోడు శాఖాపరంగా చేపట్టిన సంస్కరణలు కూడా ఆదాయానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ ప్రక్రియను సులభతరం చేయడం, తొలినాళ్లలో జరిగిన విధంగా రిజిస్ట్రేషన్ సేవలు స్తంభించడం లాంటి సమస్యలను విజయవంతంగా అధిగమించడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి వరకు రిజిస్ట్రేషన్ జిల్లాల వారీగా రాబడులు:
రిజిస్ట్రేషన్ జిల్లా ఆదాయం (రూ.కోట్లలో)
రంగారెడ్డి 1,976.77
మేడ్చల్ 1,055.86
మెదక్ 470.64
మహబూబ్‌నగర్ 147.51
హైదరాబాద్ 233.78
హైదరాబాద్ (సౌత్) 459.50
నిజామాబాద్ 93.19
కరీంనగర్ 154.69
వరంగల్ 222.53
నల్లగొండ 272.65
ఖమ్మం 107.68
ఆదిలాబాద్ 66.99
మొత్తం 5,261.85
Comments
Please login to add a commentAdd a comment