
సాక్షి, హైదరాబాద్: చట్టాలు చేయాలనిగానీ, అమలులో ఉన్న చట్టాలను ఫలానా విధంగా సవరణలు చేయాలనిగానీ చట్టసభలకు న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయజాలవని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాలు చేయడంతో పాటు ఉన్న చట్టాలకు సవరణలు చేసే అధికారం చట్టసభదేనని, శాసనసభ చట్టం ఏం చేయాలో, అవి ఎలా ఉండాలో న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయబోవని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తన నిర్ణయాన్ని వెల్లడిచింది.
నేర శిక్షా స్మృతి (సీఆర్‌పీసీ)లోని 41(1)(బి) సెక్షన్‌ను సవరించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఈ ఆదేశాలిచ్చింది. ఆ సెక్షన్‌కు సవరణల ప్రతిపాదనలు శాసనసభ ఎదుట లేదా గవర్నర్ లేదా రాష్ట్రపతి వద్ద ఉంచేలా తెలంగాణ హోం శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుబ్బరాయశాస్త్రి అనే వ్యక్తి తరఫున జీపీఏ హోల్డర్ పి.దుర్గాదేవి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది.