ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ హత్య కేసుకు సంబంధించిన రికార్డులన్నీ విజయవాడ కోర్టులో ధ్వంసమయ్యాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హైకోర్టుకు తెలిపింది. ఉమ్మడి హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడే రికార్డులు ధ్వంసమయ్యాయని సిట్ అధికారులు ధర్మాసనానికి తెలిపారు. దీనిపై ఆగ్రహించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రికార్టుల ధ్వంసంపై విచారణకు ఆదేశించింది. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని రిజిస్టార్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో పోలీసు విచారణ కంటే సీబీఐ దర్యాప్తే మేలని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిలో భాగంగా సీబీఐని సైతం సుమోటో ప్రతివాదిగా చేర్చించింది.
అసలేం జరిగిందంటే..
కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్‌లో 2007 డిసెంబర్‌లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో అతడిని.. ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఈ దర్యాప్తు బాధ్యతను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా హైకోర్టు నిర్ణయంపై అయేషా మీరా తల్లిదండ్రులు, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment