
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : అధికార యంత్రాంగం అండతో ప్రజాప్రతినిధులు, కబ్జాదారులు నెన్నెల మండలంలో సాగించిన భూదందాలపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు స్పందించింది. మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవడమే కాకుండా, ఆ భూములకు నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి, బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందిన ఆధారాలను పరిశీలించింది. నాలుగు వారాల్లోగా నెన్నెల భూదందాకు సంబంధించిన అంశాలన్నింటిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్‌ను ఆదేశించింది.
నెన్నెల భూబాగోతాలపై 2017 సెప్టెంబర్ నెలలో ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన వార్త కథనాల ఆధారంగా గొల్లపల్లికి చెందిన ఇందూరి రామ్మోహన్ అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సాక్షి కథనాలకు తోడు మండలంలోని పలు గ్రామాల్లో ఆక్రమణలకు గురైన భూములకు సంబంధించిన ఆధారాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వారి బంధువుల పేర్లతో ఆన్‌లైన్ పహాణీల్లోకి ఎక్కిన భూముల వివరాలను హైకోర్టు ముందుంచారు. ప్రభుత్వ భూములకు పాస్ పుస్తకాలు తయారు చేసి, మూడు బ్యాంకుల నుంచి రుణాలు పొందిన ఆధారాలు కూడా సమర్పించారు. ఈ పిల్‌పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం కేసు తీవ్రతను గుర్తించి, నాలుగు వారాల్లోగా నివేదిక అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్లు వ్యాఖ్యానించింది.
రెండు వేల ఎకరాలు కబ్జా!
మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలోనే అత్యధికంగా 16,679 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు ఉన్నట్లు రికార్డులు చెపుతున్నాయి. వీటిలో 1977.63 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు అధికారికంగా తహసీల్ధార్ కార్యాలయం దగ్గరున్న భూ రికార్డులు చెపుతున్నాయి. ఇవి కాకుండా గత నాలుగేళ్ల కాలంలో మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. నెన్నెలలో జరిగిన, జరుగుతున్న భూ దందాలపై ‘సాక్షి’ దినపత్రిక వరుస కథనాలను ప్రచురించింది. నెన్నెల ఎంపీపీ, గ్రామ సర్పంచ్, మండల కో ఆప్షన్ సభ్యుడితో పాటు పలువురు అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు సాగించిన భూ ఆక్రమణలను సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఆక్రమించిన ప్రభుత్వ భూముల్లోకి వెళ్లేందుకు ఏకంగా ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.13 లక్షలు వెచ్చించి రోడ్డు నిర్మాణం చేయడాన్ని కూడా సాక్షి ఆధారాలతో సహా బహిర్గతం చేసింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ నెన్నెల భూదందా కథనాలపై కలెక్టర్ ఆర్‌వీ. కర్ణన్ కూడా స్పందించారు. నకిలీ పాస్ పుస్తకాలకు సంబంధించి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రభాకర్‌ను విచారణాధికారిగా నియమించారు. ఆయన తన నివేదికను కలెక్టర్‌కు సమర్పించినట్లు సమాచారం. ఈలోగా ఇందూరి రామ్మోహన్ హైకోర్టును ఆశ్రయించగా, మంగళవారం విచారణకు వచ్చింది. కలెక్టర్ ఇచ్చే నివేదికపైనే పురోగతి ఆధారపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment