
ఈ దశలో జోక్యం చేసుకోలేం
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఓటుహక్కుపై హైకోర్టు ఝ ఎటువంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని స్పష్టీకరణ
అనుబంధ పిటిషన్లు దాఖలు చేసిన టీడీపీ, కాంగ్రెస్ ఝ తదుపరి విచారణ జూన్ 2కి వాయిదా
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు జూన్ 1న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ప్రస్తుత దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, జస్టిస్ టి.సునీల్ చౌదరితో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేసింది. టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోకుండా నియంత్రించాలంటూ తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు గురువారం హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదేవిధంగా కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రెడ్యానాయక్, విఠల్‌రెడ్డి, కనకయ్యలను సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోకుండా నియంత్రించాలంటూ కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్ సైతం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలను జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు నేతృత్వంలోని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం విచారించింది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని, ఆయన స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామని పిటిషనర్లు తెలిపారు.
తమ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, విచారణార్హత లేదంటూ కొట్టేశారని, దీంతో తాము ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశామని, అవి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పార్టీ ఫిరాయించిన వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పిస్తూ ఓటర్ల జాబితా రూపొందించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఎన్నికల అంశంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత దశలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓటుహక్కు వినియోగించుకోకుండా నియంత్రించలేమంది. దీనికి పిటిషనర్లు స్పందిస్తూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వినియోగించుకునే ఓటుహక్కుకు సంబంధించి తమ అప్పీళ్లపై కోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉండాలనైనా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ధర్మాసనం అందుకు సైతం నిరాకరిస్తూ, ప్రాథమికంగా తాము సంతృప్తి చెందకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది.