‘ఫిరాయింపు’ మంత్రులకు నోటీసులు
పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ తరపున గెలిచి అధికార టీడీపీలోకి ఫిరాయించి, మంత్రులుగా నియమితులైన ఎన్. అమర్ నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, సి.ఆది నారాయణరెడ్డి, సుజయ కృష్ణా రంగారావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అర్హత లేని వారు మంత్రులా?
పార్టీ ఫిరాయించిన అమర్‌నాథ్‌రెడ్డి, అఖిల ప్రియ, ఆదినారాయణరెడ్డి, సుజయ కృష్ణా రంగారావుకు మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, మంత్రులుగా ఏ అర్హతతో కొనసాగుతున్నారో వారిని వివరణ కోరాలంటూ హైదరాబాద్‌కు చెందిన పాత్రికే యుడు తంగెళ్ల శివప్రసాద్‌రెడ్డి వేర్వేరుగా నాలుగు కో వారెంట్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలి సిందే. ఈ వ్యాజ్యాలపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మం గళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది ఆనంద్‌కుమార్ కపూర్ వాద నలు వినిపించారు. టీడీపీలో చేరిన అఖిల ప్రియ, సుజయ కృష్ణా, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారని తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న వారు చట్టసభల్లో సభ్యులుగా కొనసా గడానికి వీల్లేదన్నారు.
చట్టసభల్లో సభ్యులుగా కొనసాగే అర్హత లేని వారిని మంత్రు లను చేయడానికి వీల్లేదని వివరించారు. రాజ్యాంగం ఓ వ్యక్తిని మంత్రి కాకుండా నిషేధించినప్పుడు ఆ వ్యక్తిని మంత్రిగా నియమించే విషయంలో సీఎం సలహాను గవర్నర్ పాటించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని గవర్నర్ ప్రమాణం చేశారని, అటువంటి వ్యక్తి రాజ్యాంగం నిషేధించిన వ్యక్తి చేత మంత్రిగా ప్రమాణం చేయించడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందన్నారు. ఈ సమయంలో ధర్మాస నం స్పందిస్తూ... ప్రభుత్వ వివరణ కోరింది. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే వ్యాజ్యాలు దాఖలయ్యాయని, వాటితో ఈ వ్యాజ్యాలను కూడా జత చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్ చెప్పారు.
అయితే, ఈ ప్రతిపాదనను ఆనంద్‌కుమార్ వ్యతిరేకించారు. ఆ వ్యాజ్యాలతో ఈ వ్యాజ్యాలను జత చేయవద్దని, ఆ వ్యాజ్యాలు విచారణకు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నామని తెలియజేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. దీంతో వారికి కూడా న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. ఫిరాయింపుదార్లకు మంత్రి పదవుల అంశంపై వారు వివరణ ఇవ్వాలని సూచించింది.