సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసులో ముగ్గురు పోలీసు అధికారులకు సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్ష అమలును నిలిపివేస్తూ హైకోర్టు ధర్మాసనం స్టే ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ కమల్‌హాసన్‌రెడ్డి, కరీంనగర్ ఏసీపీ తిరుపతి, ఎస్‌హెచ్‌ఓ శశిధర్‌రెడ్డిలకు ఆరు నెలల జైలుశిక్ష, రూ. 2 వేల చొప్పున జరిమానా, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 10 చొప్పున లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశిస్తూ గతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాల్‌చేస్తూ పోలీసు అధికారులు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌లోని ఓ రిసార్టుపై దాడులు చేయరాదని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా సివిల్ దుస్తుల్లో వెళ్లి తనిఖీలు చేసినందుకు పోలీసులపై కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు సింగిల్ జడ్జి జైలుశిక్ష విధించారు. అయితే రిసార్ట్స్ యాజమాన్యం సమర్పించిన పత్రాల ఆధారంగా సింగిల్ జడ్జి తీర్పు చెప్పారని, వాస్తవానికి ఇది కింది కోర్టు తేల్చాల్సిన వ్యవహారమని హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పీల్ పిటిషన్లను విచారణకు అనుమతిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment