సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో కీలక నక్సల్ నేత ఎన్‌కౌంటర్‌తో ఏజెన్సీ ఉలిక్కిపడింది. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ (రాయల వర్గం) ఖమ్మం, వరంగల్ రీజినల్ కార్యదర్శి, ఆపార్టీ అజ్ఞాత దళాల కమాండర్ పూనెం లింగన్న అలియాస్ శ్రీధర్ హతమయ్యారు. బుధవారం తెల్లవారుజామున గుండాల మండలంలోని రోళ్లగడ్డ–దేవళ్ల గూడెం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో పందిగుట్ట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో లింగన్న మృతి చెందగా, మరో ఆరుగురు తప్పించుకున్నారు. ఈఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
(చదవండి : అభయారణ్యంలో ఎన్‌కౌంటర్)
విచారణ చేపట్టిన హైకోర్టు లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం జరిపించాలని ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం జరిపించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం నివేదికను సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని మెడికల్ బోర్డు సీనియర్ అధికారులకు స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలతో ఈ నెల 5న కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఎన్‌కౌంటర్ చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు.
సిట్టింగ్ జడ్జితో విచారించాలి
సాక్షి, హైదరాబాద్: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు లింగన్నను పోలీసులు కాల్చి చంపడంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వివిధ వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఇది ఎన్‌కౌంటర్ కాదని, పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సీపీఎం నేత తమ్మినేని వీర భద్రం అన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ తర్వాత ఆరు పోలీస్‌స్టేషన్లలో ప్రజలను నిర్బంధించారని న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు తెలిపారు. పోడు భూముల కోసం ఉద్యమించిన నేతను చంపడ మంటే ప్రజలపై యుద్ధం చేయడమే అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment