సాక్షి, హైదరాబాద్ : కరోనా పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి పలు ఆదేశాలు జారీచేసింది. కరోనా కీలక సమాచారాన్ని మీడియా బులెటిన్‌లో ఉంచాలని తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల వారిగా కరోనా కేసులు వెల్లడించాలని సూచించింది. ఆ వివరాలు కాలనీ సంఘాలకు ఇవ్వాలని ఆదేశించింది. ర్యాపిడ్ యాంటీజెంట్ టెస్ట్ నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించిందని గుర్తుచేసింది. ఐసీఎంఆర్ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. వైద్యులకు తగినన్ని పీపీఈ కిట్లు, మాస్క్‌లు ఇతర రక్షణ పరికరాలు ఇవ్వడం లేదంటూ న్యాయవాది సమీర్ అహ్మద్ హైకోర్టుకు లేఖ రాయగా, దీన్ని కోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. నేడు కూడా దానిని కొనసాగించింది. ఈ విచారణకు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు హాజరయ్యారు. రాష్ట్రంలో 79 మంది వైద్యులకు కరోనా సోకినట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. గాంధీలో ప్లాస్మా, యాంటీ వైరల్ డ్రగ్స్ ప్రయోగాలు చేస్తున్నట్టు వెల్లడించారు. (చదవండి : ‘కరోనా’పై చేతులెత్తేసినట్లుంది..)
విచారణ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గాంధీతోపాటు 54 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయని ప్రచారం చేయాలని తెలిపింది. సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో ప్రభుత్వం వివరించాలని కోరింది. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందితోపాటు పోలీసులకు కూడా రక్షణ కిట్లు ఇవ్వాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రి సిబ్బందికి కూడా గాంధీ తరహా షిఫ్ట్‌ల విధానం అమలు చేయాలని తెలిపింది.లక్షణాలు లేని ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు నిర్వహించాలన్న ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ఈ నెల 29లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment