
శిక్షించాల్సింది ఆ బంగారం కొంటున్న వారిని..
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్: దోచుకొచ్చిన బంగారాన్ని దొంగల నుంచి కొనుగోలు చేస్తున్న బంగారు వ్యాపారులు, పాన్‌బ్రోకర్లపై కఠినంగా వ్యవహ రించకపోవడం వల్లే దొంగతనాలు పెరుగు తున్నాయని ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. దొంగతనం చేసి తీసుకొచ్చిన బంగారాన్ని కొంటూ మళ్లీ మళ్లీ దొంగతనాలను చేయాలని దొంగలను వారే ప్రోత్సహిస్తున్నారంది. ఇలా ప్రోత్సాహం అందిస్తున్న వారినే శిక్షించాలని స్పష్టం చేసింది. దొంగ సొత్తు కొనుగోలు చేసిన ఓ వ్యాపారికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చేం దుకు నిరాకరించిన హైకోర్టు తదుపరి విచారణ ను జనవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రంగారెడ్డి జిల్లా, పరిగి పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టకుండానే తమను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గుల్బర్గాకు చెందిన జీవన్ హనుమంత్ సావంత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని బుధవారం హైకోర్టు విచారించింది. హోంశాఖ సహాయ న్యాయవాది పిటిషనర్‌కు దొంగ బంగారం కొనుగోలు చేయడం అలవాటని, అతనిపై 20 కేసులున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ, ఇటువంటి వ్యక్తులే దొంగతనాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.