క్లిష్ట పరిస్థితుల్లో కొత్త సచివాలయమా? : హైకోర్టు | The High Court Questioned the Government About the Construction of a New Secretariat | Sakshi
Sakshi News home page

క్లిష్ట పరిస్థితుల్లో కొత్త సచివాలయమా? : హైకోర్టు

Published Fri, Jan 3 2020 1:41 AM | Last Updated on Fri, Jan 3 2020 10:26 AM

The High Court Questioned the Government About the Construction of a New Secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతిక్లిష్టంగా ఉన్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో కోట్లు ఖర్చు చేసి కొత్త సచివా లయం నిర్మించాలా? ప్రజాహితం కోసమే కావచ్చు. కొత్తగా నిర్మాణం చేస్తే కనీసం అయిదారేళ్లు సమయం పడుతుంది. ఇందుకు వ్యయం చేశాక ఆదాయం ఏమీ రాదు. ఇలాంటప్పుడు కొత్తగా నిర్మాణం చేయాలా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నగరంలోని వేర్వేరు చోట్లకు సచివాలయ కార్యాలయాన్ని తరలించేస్తే, అధికారిక రహస్య ఫైళ్ల పరిస్థితి ఏమిటి? ఆ ఫైళ్లు తరలించే దారిలో అవి కనిపించకుండా పోతే? ఆ ఫైళ్లు తారుమారయ్యే అవకాశం లేదా? వేర్వేరు చోట్ల సచివాలయ కార్యాలయాలు ఉంటే కీలకఫైళ్లకు కాళ్లు వస్తే పరిస్థితి ఏమిటి? అని ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. 

గందరగోళంగా మంత్రివర్గ నిర్ణయం..
సచివాలయ అంశంపై మంత్రివర్గం 2019 ఫిబ్రవరి 18న తీసుకున్న నిర్ణయం చూస్తే అంతా గందరగోళంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి తగినట్లుగా అన్ని హంగులతో భావితరాలకు సరిపడేలా ఉన్నతస్థాయి నిర్మాణం చేయడమే కొత్త సచివాలయ ఉద్దేశం అని ఒక చోట ఉంది. పాత సచివాలయానికే మార్పులు చేర్పులు చేసి ఆధునీకరించి వినియోగించుకోవాలని మరోచోట ఉంది. పరస్పర విరుద్ధంగా అంతా అయోమయంగా కేబినెట్‌ నిర్ణయం ఉంది. ఇంతకీ ఆ ద్వంద్వ నిర్ణయాలేమిటో, వాటి ఆచరణలో అమలయ్యేదేమిటో చెప్పాలి..? అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. సచివాలయాన్ని కూల్చి కొత్తగా నిర్మాణం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను గురువారం విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం.. పలు ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఉక్కిబిక్కిరి చేసింది. ఎంతకాలంలో కొత్త సచివాలయాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సత్వరమే నిర్మాణం చేయాలనుకున్నా కనీసం మూడేళ్లు పడుతుందని, అప్పటివరకూ వేర్వేరు చోట్ల ఉన్న ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉంటుందని ప్రశ్నించింది.

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదిస్తూ మంత్రివర్గం నిర్ణయం తర్వాత మంత్రివర్గ ఉప సంఘం కూడా ఏర్పాటైందని, ఈ అంశంపై అధ్యయనానికి ఆ సంఘం సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిన కారణంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పగానే ధర్మాసనం కల్పించుకుని సచివాలయ భవనాల్ని కూల్చరాదని మాత్రమే తాము స్టే ఉత్తర్తులు జారీ చేశామని, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అంశాలపై కాదని తేల్చి చెప్పింది. ఏఏజీ వాదనలు కొనసాగిస్తూ కొత్తగా సచివాలయ భవనాలు నిర్మించాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, సాంకేతిక కమిటీ కూడా ఆ విధంగా నివేదిక కూడా ఇచ్చిందని చెప్పారు. సచివాలయాన్ని 70 శాతం వరకూ బూర్గుల భవనంలోకి, మిగిలిన 30 శాతాన్ని నగరంలోని వేరువేరు ప్రభుత్వ భవనాల్లోకి తరలించామని తెలిపారు. చాలా వరకూ మంత్రులు, ఆయా శాఖాధిపతులు ఒకేచోట ఉంటున్నారని చెప్పారు. 

జోక్యం చేసుకోవడానికి వీల్లేదు..
మంత్రివర్గ నిర్ణయాల్లో న్యాయ స్థానాలు జోక్యం చేసుకోడానికి వీల్లేదని చెప్పగానే, నిర్ణయం సహేతుకం కానప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చునని ధర్మాసనం బదులిచ్చింది. అన్నీ ప్రభుత్వం చెబుతోంది గానీ, వాటిని కౌంటర్‌ పిటిషన్‌ ద్వారా హైకోర్టుకు తెలియజేయట్లేదని ధర్మాసనం పేర్కొంది. అనంతరం కొత్త సచివాలయ నిర్మాణానికి ఎన్ని రూ.కోట్లు అవసరం అవుతాయి, నిధులు ఎక్కడి నుంచి సమీకరిస్తున్నారు, పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేయడానికి ఎంత కాలం పడుతుందని అంచనా వేశారు, కొత్త భవనాల డిజైన్‌ ఏది, ఎంత విస్తీర్ణంలో నిర్మాణం చేయాలని భావిస్తున్నారు, శాఖల వారీగా ఎంత స్థలం అవసరం, మొత్తం 25 ఎకరాల స్థలంలో నిర్మాణం ఏ మేరకు చేస్తారు.. వంటి వివరాలతోపాటు సాంకేతిక కమిటీ నివేదిక ఇతర అంశాలపై రోడ్డు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement