టీఆర్‌ఎస్‌ నేతలకు హైకోర్టు షాక్‌ | High Court shock to TRS leaders | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ నేతలకు హైకోర్టు షాక్‌

Published Sat, Apr 28 2018 2:39 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

High Court shock to TRS leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్‌) ఎన్నికను సవాలు చేస్తూ టీఆర్‌ఎస్‌ నేతలు కంచర్ల భూపాల్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ‘‘చిన్న చిన్న కారణాలతో ఎన్నికను రద్దు చేయడం అసాధ్యం. అందుకు పూర్తిస్థాయి ఆధారాలు ఉండాలి’’అంటూ పిటిషనర్లకు చెరో రూ.25 వేల జరిమానా విధించింది.

ఈ మొత్తాన్ని కోమటిరెడ్డికి చెల్లించాలని ఆదేశించింది. 2014లో ఎన్నికలప్పుడు కోమటిరెడ్డి తాను బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (బీఈ) పూర్తి చేసినట్లు ఎన్నికల నామినేషన్‌లో తప్పుగా పేర్కొన్నందున ఆయన ఎన్నికను రద్దు చేయాలని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కంచర్ల పిటిషన్‌ దాఖలు చేశారు. 2009 ఎన్నికల్లో కూడా కోమటిరెడ్డి బీఈ చదవానని పేర్కొన్నారని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని దుబ్బాక మరో పిటిషన్‌ దాఖలు చేశారు. కంచర్ల, దుబ్బాక ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. వారి పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు శుక్రవారం తుది తీర్పునిచ్చారు. ఇంజనీరింగ్‌ విషయంలో కోమటిరెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారన్న వాదనలను తోసిపుచ్చారు.
 
తప్పుడు సమాచారం కాదు 
‘కోమటిరెడ్డి ఇంజనీరింగ్‌ చదవినట్లు పిటిషనర్లే చెబుతున్నారు. ఇది వాస్తవం కూడా. బీఈ సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివేందుకు కోమటిరెడ్డి 1982లో చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (సీబీఐటీ)లో చేరారు. 1989 వరకు పరీక్షకు హాజరయ్యారు. డిగ్రీ మాత్రం పొందలేకయారు. అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలతో పాటు తాము చదివిన కోర్సు తదితర వివరాలు పొందుపరిచే అఫిడవిట్‌ (ఫాం 26)లో కోమటిరెడ్డి తాను పూర్తి చేసిన కోర్సుల గురించే వివరించారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌లతో పాటు బీఈ చదివిన విషయాన్ని ప్రస్తావించారు.

ఇది వాస్తవాలను దాయడం, తప్పుడు సమాచారమివ్వడం కిందకు రాదు. దీన్ని తప్పుడు సమాచారంగా పరిగణించలేం. కోమటిరెడ్డి 1986లో కోర్సు పూర్తి చేయలేదనేందుకు పిటిషనర్లు ఆధారాలు చూపలేకపోయారు. డిగ్రీ సాధించడానికి ఎన్నేళ్లు చదవాలో చెప్పేది కోర్సు. పరీక్షలు రాసి అర్హత ఆధారంగా సంపాదించేది డిగ్రీ. ఈ తేడాను పిటిషనర్లు గుర్తించలేకపోయారు. వారి వాదనలు సహేతుకం కాదు. అందువల్ల పిటిషన్లను కొట్టేస్తున్నా’’అని న్యాయమూర్తి పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement