
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం
సాక్షి, గజ్వేల్: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలపై గురువారం హైకోర్టు స్టే విధించింది. మున్సిపాలిటీ పరిధిలో బీసీ ఓటర్ల గణన, వార్డుల పునర్విభజన అసంబద్ధంగా సాగిందని పట్టణానికి చెందిన పరుచూరి రాజు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా కొన్ని వార్డుల్లో 2 వేలు, 1800 ఓటర్లను ఉంచి చాలా వార్డుల్లో 1,200 ఓటర్లకే పరిమితం చేశారని.. ఇది ఏ విధంగా సమంజసంగా ఉంటుందని కోర్టులో పిటిషన్ వేశారు. అంతేగాకుండా బీసీ ఓటర్ల గణన కాపీని ఇంటింటికీ తిరిగి చేపట్టాల్సి ఉండగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించి గణనను తప్పుల తడకగా మార్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. చాలా వార్డుల్లో బీసీలను ఓసీలుగా చూపారని, కొన్ని వార్డుల్లో ఓసీలను బీసీలుగా చూపారని కోర్టుకు వివరించారు.
ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుతానికి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై స్టే విధించింది. వార్డుల పునర్విభజన, బీసీ ఓటర్ల గణన సరిచేసేంతవరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని స్టే ఆర్డర్‌లో పేర్కొంది. ఎన్నికలకు సిద్ధమైన పలువురు ఆశావహులు తమతమ ప్రయత్నాలను ముమ్మరం చేసి నతరుణంలో ఈ పరిస్థితి తలెత్తడం కలవరం రేపుతోంది. ఈ అంశంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డిని వివరణ కోరగా. తనకు ఇంకా హై కోర్టు స్టే ఆర్డర్ కాపీ అందలేదని, అందిన తర్వాత ఏవిధంగా ముందుకెళ్లాలనే అంశంపై ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లుస్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment