సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం విచారణను ముగించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు వాహనాల డ్రైవర్లు ఆకలి చావులకు గురయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేలా ఆదేశించాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. ఆర్థిక సాయం చేయాలా వద్దా అన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఈ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకొని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆకలి చావులకు గురవుతున్నారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా.. ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి రూ.1,500 నగదు, ఒక వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యం ఇచ్చిందని, వీటిని ఈ డ్రైవర్లు కూడా తీసుకొని ఉంటారు కదా, అలాంటప్పుడు ఆకలి చావులకు గురయ్యే పరిస్థితి ఎక్కడుందని ప్రశ్నించింది. ఆర్థిక ఇబ్బందులతో ఒక డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలపగా.. ఆత్మహత్యకు మరేమైనా కారణాలు ఉండి ఉంటాయని, బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ కూడా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తుచేసింది.
డ్రైవర్లంతా అసోసియేషన్‌గా ఏర్పడి తమ సమస్యలను తెలియజేస్తూ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాలని సూచించింది. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే న్యాయ సేవ సాధికార సంస్థను ఆశ్రయించి తగిన ఉత్తర్వులు పొందవచ్చని సూచించింది. ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించకుండా నేరుగా ఎలా పిటిషన్ దాఖలు చేస్తారని పిటిషనర్‌ను ప్రశ్నిస్తూ తీర్పును రిజర్వు చేసింది.
ఆర్థిక సాయం చేయాలని ఆదేశించలేం
Published Wed, Jul 22 2020 6:03 AM | Last Updated on Wed, Jul 22 2020 6:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment