సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వలస కార్మికులను వారి స్వస్థలాలకు క్షేమంగా తరలించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. వారిని రాష్ట్ర సరిహద్దుల వద్ద వదిలేయకూడదని, సురక్షిత ప్రాంతాలకు పంపాలని ఉత్తర్వులు జారీ చేసింది. తాము జారీ చేసే ఉత్తర్వులను తేలిగ్గా తీసుకున్నా, అమలు చేయకపోయినా తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. వలస కార్మికులను రాష్ట్ర సరిహద్దుల వద్ద నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారని పేర్కొంటూ ప్రొఫెసర్ రమా శంకర నారాయణ మేల్కేటే దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారించింది. మేడ్చల్ జాతీయ రహదారిపై నడిచి వెళుతున్న వలస కార్మికులను అక్కడి ఫంక్షన్ హాల్‌లో ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసి వలస కార్మికులను క్షేమంగా వారి స్వస్థలాలకు తరలించాలని ఆదేశించింది. వలస కార్మికులను సరిహద్దుల వద్ద దించేస్తే ఇతర సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. మహారాష్ట్రకు చెందిన వలస కార్మికులను ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు దాటగానే వదిలేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ చెప్పారు. పిల్లలు, పెద్దలే కాకుండా గర్భి ణులు కూడా నడిచి వెళుతున్నారని, రహదారిలోనే ప్రసవాలు కూడా జరిగాయన్నారు. ప్రధానంగా మే డ్చల్ జాతీయ రహదారిపై నడిచి వెళ్లే వారి కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన వలస కార్మికులు సొంతంగా అద్దె బస్సు తీసుకువెళ్లారని, అయితే డ్రైవర్ వారిని ఆదిలాబాద్ సరిహద్దు దాటాక దించేశారని చెప్పారు. వలస కార్మికుల కోసం ప్రభుత్వం ప్రతి 10 కిలోమీటర్లకు ఆహారం, తాగునీరు వంటివి ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను 29కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment