సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ కావాలనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో హైటెక్ కాపీయింగ్‌తో అడ్డదారి తొక్కిన ఐపీఎస్ అధికారి సఫీర్ కరీం జీవితంలో సినిమాటిక్ అంశాలు ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి 2015 సివిల్ సర్వీసెస్‌లో కరీం ఐఏఎస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉన్న ర్యాంకు సాధించినా.. వద్దనుకుని ఐపీఎస్‌కు వచ్చారు. దీనికి ఓ సినిమాలో పాత్ర ఆయనకు స్ఫూర్తి కలిగించినట్లు పోలీసులు చెప్తున్నారు.
కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్ తర్వాత పోలీసు ఉద్యోగం వద్దనుకుని ఐఏఎస్ అధికారి కావాలని భావించారు. దీనికోసం పాల్పడిన హైటెక్ కాపీయింగ్‌కూ మరో చిత్రంలో సన్నివేశమే స్ఫూర్తి అని గుర్తించినట్లు చెన్నై పోలీసులు చెప్తున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న చెన్నై పోలీసు విభాగానికి చెందిన డీసీపీ అరవిందన్ నేతృత్వంలోని బృందం లా ఎక్స్‌లెన్సీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌తో పాటు దీని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.రాంబాబు ఇంట్లోనూ సోదాలు చేసింది.
సాయంత్రానికి కరీం భార్య జోయ్‌సీ జోయ్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచి విమానంలో చెన్నైకి తరలించింది. రాంబాబును సైతం తమ వెంట తీసుకువెళ్లిన చెన్నై పోలీసులు.. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా అతని అరెస్టుపై నిర్ణయం తీసుకుం టామన్నారు.
ప్రమాదం తర్వాత మారిన లక్ష్యం
తన కోచింగ్ సెంటర్‌లో ఎకనమిక్స్ ఫ్యాకల్టీగా పని చేసిన జోయ్‌సీ జోయ్‌ను కరీం వివాహం చేసుకున్నాడు. ఇటీవల ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కరీం.. ఫిట్‌నెస్ సమస్య కారణంగా తాను పోలీసు అధికారిగా పనికిరానని భావించినట్లు, అందుకే ఈసారి ఐఏఎస్‌కు ఎంపిక కావాలని నిర్ణయించుకున్నట్లు అతడి స్నేహితులు చెన్నై పోలీసులకు తెలిపారు. తాజాగా అనుసరించిన హైటెక్ కాపీయింగ్‌కు కూడా ఓ సినిమానే స్ఫూర్తిగా నిలిచింది.
‘మున్నాభాయ్ ఎంబీబీ ఎస్’ చిత్రం తమిళ వెర్షన్ ‘వసూల్ రాజా ఎంబీబీఎస్’ సినిమాలో చూపిన సీన్ మాదిరిగానే తన భార్య, రాంబాబుతో కలసి కాపీయింగ్‌కు ప్లాన్ చేశాడని దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌లోని లా ఎక్స్‌లెన్సీ ఐఏఎస్ ట్రైనింగ్ అకాడెమీకి జోయ్‌సీ విజి టింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యం లో ఆమెను హైదరాబాద్ పంపిన కరీం.. రాంబాబుతో కలసి తన హైటెక్ కాపీయింగ్‌కు సహక రించేలా చూశారు.
కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) సమాచారం తో సోమవారం కరీంను చెన్నైలో పట్టుకున్న అక్కడి పోలీసులు హైదరాబాద్‌లో ఉన్న జోయ్‌సీ, రాంబాబు లకు సంబంధించిన సమా చారం ఇక్కడి పోలీసులకు అందించారు. దీంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
‘లా ఎక్స్‌లెన్సీ’లో సోదాలు..
మంగళవారం నగరానికి వచ్చిన చెన్నై పోలీసు విభాగం డీసీపీ అరవిందన్ నేతృత్వంలోని బృందం కరీం భార్య జోయ్‌సీని అరెస్టు చేసింది. అశోక్‌నగర్ చౌరస్తాలో ఉన్న లా ఎక్స్‌లెన్సీ కార్యాలయంతో పాటు దాని ఎండీ రాంబాబు ఇంట్లోనూ సోదాలు చేసింది.
హైటెక్ కాపీయింగ్‌కు వినియోగించిన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకుంది. జోయ్‌సీని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై చెన్నైకు తీసుకువెళ్లారు. ఈమెను బుధవారం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తామని ప్రత్యేక బృందం అధికారి తెలిపారు.
ఐపీఎస్ తొలగింపు?
న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారి సఫీర్ కరీంను సర్వీసు నుంచి తొలగించే అవకాశాలున్నాయి. అతను సరైన వివరణ ఇవ్వకుంటే వేటు తప్పదని హోం మంత్రిత్వ శాఖ ఓ అధికారి హెచ్చరించారు. పరీక్ష సమయం లో ఆయన ప్రవర్తన గురించి నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ‘అలాంటి వ్యక్తికి ఐపీఎస్ లాంటి సర్వీసులో ఉండే అర్హత లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగా నే ఆయనపై చర్యలను ప్రారంభిస్తాం. తన వాదనలు వినిపించేందుకు ఆయనకో అవకాశమిస్తాం’ అని ఆ అధికారి వెల్లడించారు.
ఐపీఎస్‌కు ‘కమిషనర్’ స్ఫూర్తి
కేరళలోని అలూవ ప్రాంతానికి చెందిన కరీం త్రిసూర్‌లోని మెట్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేశాడు. అప్పట్లో క్యాట్ పరీక్ష కూడా రాసిన కరీం అందులో టాపర్‌గా నిలిచాడు. 1994లో విడుదలైన మలయాళ చిత్రం ‘కమిషనర్’లోని పాత్రతో స్ఫూర్తి పొందిన కరీం ఐపీఎస్ అధికారి కావాలని నిర్ణయించుకున్నాడు. 2014లో అశోక్‌నగర్‌లో లా ఎక్స్‌లెన్సీ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న రాంబాబుతో కలసి తిరువనంతపురంలో కరీమ్స్ లా ఎక్స్‌లెన్సీ పేరుతో ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అందులో తాను కోచింగ్ తీసుకుంటూనే మరికొందరు అభ్యర్థులకూ తర్ఫీదు ఇచ్చాడు.
ఆ ఏడాది తన వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థులతో కలిసే సివిల్స్ రాసిన కరీం.. తన విద్యార్థులైన 20 మందితో కలసి ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఆరు మార్కుల తేడాతో మౌఖిక పరీక్షకు అర్హత సాధించలేకపోయాడు. 2015లో మరోసారి సివిల్స్ రాసిన కరీంకు జాతీయ స్థాయిలో 112వ ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకుతో ఐఏఎస్ అయ్యే అవకాశం ఉన్నా.. ‘కమిషనర్’ స్ఫూర్తితో తన తొలి ప్రాధాన్యం ఐపీఎస్‌కే ఇచ్చి పోలీసు అధికారిగా మారాడు. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న నంగునేరి సబ్–డివిజన్‌కు ఏఎస్పీగా పని చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment